తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు గుదిబండగా మారుతుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే పిల్లలను చదివించడం తల్లిదండ్రులకు గుదిబండగా మారుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. ఫీజులే కాకుండా రవాణా, పుస్తకాలు, యూనిఫాం, షూలు విహార యాత్రలు తదితర పేర్లతో తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలను రాజకీయ పార్టీల నాయకులే ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు.
పాఠశాల విద్యకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం రూ. 8,500 కోట్లు కేటాయిస్తుండగా అంతకు మించి ప్రైవేట్ పాఠశాలలు వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లు ఏటా సుమారు రూ. 11 వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. కేజీ టు పీజీ విద్య పథకం అమలుకు నోచుకోకపోవడంతో పుట్టగొడుగుల్లా కార్పొరేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. స్కూళ్లలో ఫీజులను నియంత్రించేందుకు పకడ్బందీగా చట్టాన్ని తీసుకురావాలి. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద పిల్లలకు కేటాయించాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేట్ పాఠశాల ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి.
కామిడి సతీష్ రెడ్డి, పరకాల, వరంగల్ జిల్లా