మరల సేద్యానికి..!

మరల సేద్యానికి..! - Sakshi


♦ పాలేకర్ స్ఫూర్తితో 15 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయంలోకి  

♦ 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం

♦ రిస్క్ లేని సేద్యంతో.. తొలి ఏడాదే అనూహ్య దిగుబడులు

 

 అన్నదాతను రసాయనిక వ్యవసాయం నష్టాల పాలుజేసి వ్యాపారంలోకి వెళ్లగొడితే..  పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం తిరిగి ప్రకృతి ఒడిలోకి ఆప్యాయంగా ఆహ్వానించింది! అనుకోకుండా హాజరైన ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరం పదిహేనేళ్ల తర్వాత అతన్ని మళ్లీ పొలం బాట పట్టించింది. తీవ్రమైన కరువు నిరుత్సాహపరచినా.. ప్రకృతి సాగు నిరాశపరచలేదు.  తొలి ఏడాదిలోనే మంచి నికరాదాయాన్నిస్తోంది. ఈ విజయం ఇతర రైతులనూ ప్రకృతి సాగుకు మళ్లిస్తోంది...

 

 కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఎల్.నరసింహారెడ్డి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మొదటి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎం.కామ్ చదివిన తర్వాత ఐదేళ్లపాటు వ్యవసాయం  చేశారు. అప్పట్లో రసాయనిక వ్యవసాయం వల్ల నష్టాలే మిగిలాయి. దీంతో పొలమంతా కౌలుకు ఇచ్చి.. వ్యాపార రంగంలోకి వెళ్లిపోయారు. ఇది పదిహేనేళ్ల క్రితం మాట. అయితే, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆయనను తిరిగి నేలతల్లిని ముద్దాడేలా చేసింది. 2014 డిసెంబర్‌లో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల పాటు కర్నూలులో నిర్వహించిన శిక్షణా కార్యక్ర మంలో నరసింహారెడ్డి పాల్గొన్నారు. పాలేకర్ సూచించిన పద్ధతులపై గురి కుదిరింది. పెట్టుబడి లేకపోవటంతో రిస్క్‌గా అనిపించలేదు. పెద్దగా నష్టపోయేదేం లేదనిపించింది. పుస్తకాలు చదివి తన అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. గతేడాది నుంచి ప్రకృతి సేద్యం చేయటం మొదలు పెట్టారు. 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం...

 తొలి ఏడాదే అయినా సోదరుల పొలాన్ని కలిపి మొత్తం 60 ఎకరాల్లోను ప్రకృతి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు నరసింహారెడ్డి. వర్షాధారం కింద మొక్కజొన్న, కంది, కొర్రలను మిశ్రమ పంటలుగా 20 ఎకరాల్లోను.. కందిని ఏకపంటగా మరో 10 ఎకరాల్లోను సాగు చేశారు.  నీటి వసతి కింద మరో 20 ఎకరాల్లో కందిని సాగు చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేదు,  విత్తనాలు, కూలీల కోసం ఖర్చులేం చేయలేదు. ఎకరాకు రూ. 4 వేల లోపే ఖర్చయ్యిందని ఆయన తెలిపారు. దీనివల్ల నికరాదాయం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్షాధారం కింద సాగు చేసిన పంటల్లో ఎకరాకు మొక్కజొన్న 20 క్వింటాళ్లు,  కొర్ర 6 క్వింటాళ్లు, కంది 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షాలు అనుకూలంగా ఉంటే దిగుబడులు పెరిగేవని ఆయన చెప్పారు. ప్రకృతి సేద్యం గొప్పతనం తోటి రైతులకు తెలియజేయాలనే సంకల్పంతో ఖాళీగా ఉన్న 40 సెంట్ల కల్లం దొడ్డిలో మిశ్రమ పంటలను సాగు చేశారు. అరటి, బొప్పాయి, వివిధ  రకాల కూరగాయలు, ఆకుకూరలను కలిపి సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. చీడపీడల నివారణకు అస్త్రాలే ఆయుధంగా...

 భూమిలోని తేమ ఆరిపోకుండా గడ్డితో ఆచ్ఛాదన కల్పించారు. జీవామృతం, ఘన జీవామృతం వాడ కం వల్ల చీడపీడల సమస్యలు తగ్గాయి.  అగ్ని అస్త్రంతో రసం పీల్చే పురుగులను,  బ్రహ్మాస్త్రం తో లావు పురుగులను  నివారించారు.  తెగుళ్లు  నివారణకు జిల్లేడు, ఉమ్మెత్త, సీతాఫలం, వేప, జామ తదితర ఆకులు, ఆవు మూత్రం, పేడ కలిపి తయారుచేసిన దశపర్ణి కషాయంను వినియోగించారు. దశపర్ణిని సర్వరోగ నివారిణిగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ఆవులు లేకపోవటంతో ఇతర రైతుల ఆవుల నుంచి మూత్రం, పేడ సేకరించారు.  పంటకు మార్కెట్‌లో డిమాండ్...

 నరసింహారెడ్డి ఇంకా పంటను విక్రయించలేదు. అయితే నూరు శాతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలు కావటంతో మార్కెట్ ధర కంటే 30 శాతం ఎక్కువ చెల్లించేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నందికొట్కూరులో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి సాధించిన విజయం చూసి నందికొట్కూరులోనే 50 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు.   

 - గవిని శ్రీనివాసులు, కర్నూలు (అగ్రికల్చర్)

 

  రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష

 మొత్తం 60 ఎకరాల్లో  ప్రకృతి వ్యవసాయం చేశాను. నికరాదాయం బాగా పెరిగింది. తోటి రైతులు ఈ పద్ధతుల వైపే మొగ్గు చూపటం సంతోషం కలిగిస్తోంది. ప్రకృతి సాగులో నష్టం రావటానికి అవకాశమే లేదు. ప్రకృతి సేద్యంలో నికరాదాయం ఎక్కువ. ఎటువంటి పరిస్థితుల్లోన యినా రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష.   

 - ఎల్.నరసింహారెడ్డి (94402 86399), నందికొట్కూరు మండలం, కర్నూల్ జిల్లా.

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top