
గడ్డిని కోసే సోలార్ యంత్రం!
సౌరశక్తితో పనిచేసే గడ్డికోసే యంత్రం (సోలార్ గ్రాస్‌కట్టర్)ను విజయనగరం జిల్లా కోమటపల్లి తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేశారు.
సౌరశక్తితో పనిచేసే గడ్డికోసే యంత్రం (సోలార్ గ్రాస్‌కట్టర్)ను విజయనగరం జిల్లా కోమటపల్లి తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. కూలీల అవసరం లేకుండా నాలుగు గంటల్లో ఎకరా పొలంలో గడ్డిని కోయవచ్చని వారు తెలిపారు. మెకానికల్ విభాగం విద్యార్థులు జయకిరణ్, బేదాన్ శర్మ (91609 77016) దీన్ని తయారు చేశారు. దీనికి ఉన్న బెల్ట్‌ను మెడకు తగిలించుకుని.. రెండు చేతులతో పట్టుకొని గడ్డిని కోయవచ్చు. దీనికి అమర్చిన హ్యాండిల్‌ను ద్వారా సులువుగా గడ్డికోయవచ్చు. గడ్డిని కోసేందుకు డీసీ కరెంట్‌తో పని చేసే మోటార్‌ను ఇందులో అమర్చారు.
చార్జింగ్ అయ్యేందుకు 20 వాట్స్ సోలార్ ప్లేట్‌ను బిగించి.. 7ఏ-హెచ్, 12వాట్స్ బ్యాటరీతో అనుసంధానించారు. రెండు గంటల్లో పూర్తిగా చార్జవుతుంది. ఒక్కసారి చార్జింగ్ అయితే 40 నిమిషాల పాటు గడ్డిని కోయవచ్చు. గడ్డి కోసే సమయంలోఎండ ఉంటే ఎప్పటికప్పుడు చార్జవుతూ ఉంటుంది. దీని ధర ఇప్పటికైతే రూ. 9 వేలు. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే రూ. 3 వేలకే అందించటం వీలవుతుందని ఆవిష్కర్తలంటున్నారు.
- ఆర్. రాజమోహనరావు, బొబ్బిలి, విజయనగరం జిల్లా