చిన్న కారు రైతులు ఆకు కూరల సాగు వైపు దృష్టి సారించారు.
వేరుశనగ, ఇతర పంటలు వేసి తీవ్రంగా నష్టపోయిన సన్న, చిన్న కారు రైతులు ఆకు కూరల సాగు వైపు దృష్టి సారించారు. పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువగా వస్తుండటమే ఇందుకు కారణం. తీరప్రాంతమంతా ఇసుక నేలలు కావడంతో కూరగాయల సాగుకు ఎంతో అనువుగా ఉంటున్నాయి. రెండు సార్లు భూమిని దుక్కి దున్నితే చాలు కూరగాయల విత్తనాలు నాటుకోవచ్చు. పైగా ఆకుకూరలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. వ్యాపారులైతే నేరుగా పొలాల వద్దకు వెళ్లి ఆకు కూరలు కొనుగోలు చేస్తున్నారు.
సీజన్ ను బట్టి ధర
సుక్కకూర, పాలకూర కట్ట రూ.5-రూ.10 వరకు, గొంగూర కట్టలు రూ.6-రూ.7 వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆకు కూరలకు డిమాండ్ ఏర్పడింది. పెరిగిన కూరగాయల ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలు ఆకుకూరలు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఆకుకూరలను నిత్యం సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమాలకు సరఫరా చేస్తుండటంతో డిమాండ్ పడిపోవడం లేదు. తీరప్రాంతంలో రైతులు తాము పండించిన ఆకు కూరలను ఒంగోలు, మార్టూరు మార్కెట్‌కు తరలించి గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారు.