సీమ కాంగ్రెస్‌లో ‘రాయల’ చిచ్చు! | 'Royal' controversy in Seema Congress | Sakshi
Sakshi News home page

సీమ కాంగ్రెస్‌లో ‘రాయల’ చిచ్చు!

Nov 20 2013 2:19 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కాంగ్రెస్ నేతలు మళ్లీ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు

రాయల తెలంగాణ కోసం కర్నూలు, అనంత నేతల యత్నాలు
 మేడం అపాయిట్‌మెంట్ కోసం యత్నిస్తున్న కోట్ల
 అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో రఘువీరా, కోట్ల మంతనాలు

రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కాంగ్రెస్ నేతలు మళ్లీ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. విభజన అనివార్యమైతే తమ రెండు జిల్లాలను తెలంగాణలోనే కొనసాగించాలే తప్ప సీమాంధ్రలో విలీనం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కోట్ల నివాసంలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ సమావేశమై ఈ అంశంలో హైకమాండ్ పెద్దలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయిట్‌మెంట్ కోరినప్పటికీ ఇంకా ఖరారు కాకపోవడంతో టీజీ, ఏరాసు హైదరాబాద్ వెళ్లిపోయారు.  
 
 మరోవైపు నిన్నటి వరకు రాష్ట్రం సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని నినదించిన అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్వరం మారింది. ఆయన మంగళవారం తన నివాసంలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కు మధ్యాహ్న విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లా ప్రజల నుంచి రాయల తెలంగాణ డిమాండ్ వస్తోందని చెప్పారు. కేంద్రం లేదా కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తే మద్దతిచ్చే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. సాయిప్రతాప్ మాత్రం రాష్ట్రాన్ని విడదీయడం కంటే సమైక్యంగా కొనసాగించి పదేళ్ల పాటు అభివృద్ధి చేసిన తరువాతే విభజన గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
 
 ‘రాయల తెలంగాణ’ వెనుక వేరే ఉద్దేశం?
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వేరే దురుద్దేశాలున్నాయని అభిప్రాయపడ్డారు. హైకమాండ్ పెద్దలు దీని వెనుక పథక రచన చేసినట్లు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగితే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కన్పించడంతో రాయల తెలంగాణ పేరుతో కొందరిని, పదవుల పేరుతో మరికొందరిని విడదీసి మెజారిటీ అభిప్రాయాలు బిల్లుకు అనుకూలంగా వచ్చేలా చేయాలన్నదే హైకమాండ్ పెద్దల లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు విభజన విషయంలో రాజీపడి హైకమాండ్ లైన్లో వెళుతున్నారని, రాయల తెలంగాణ పేరుతో మరికొంతమందిని సమైక్య భావనకు దూరం చేయాలనే వ్యూహంతోనే తెరపైకి మళ్లీ ఈ అంశాన్ని తెచ్చారని పేర్కొంటున్నారు.
 
 సమైక్యం కోసం పోరాడుతా: శైలజానాథ్
 సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోసం తన పోరాటం కొనసాగిస్తానని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్ సాకే శైలజానాథ్ తెలిపారు. తాను ఎవర్నీ మభ్యపెట్టడంలేదని, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో భేటీకి హాజరైన తర్వాత తనకేమీ పశ్చాత్తాపం లేదని అన్నారు. ఏవో సొంత ఆలోచనలతో రాయల తెలంగాణ అనకుండా వాస్తవాల ఆధారంగా డిమాండ్ చేయాలని మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement