మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు - Sakshi


సాక్షి నెట్‌వర్క్: సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పార్టీ కార్యకర్తలు అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో  కేంద్రమంత్రి  దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఇళ్లను ముట్టడిం చారు. జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జోరువానలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో  కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు.   మంత్రి నివాసం వద్ద గాజులు, పూలతో  నిరసన తెలిపారు.

 

 అమలాపురం విద్యుత్‌నగర్‌లో ఎంపీ జీవీ హర్షకుమార్ క్యాంప్ కార్యాలయాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు తదితరుల నేతృత్వంలో ముట్టడించారు. రంపచోడవరంలో రాజ్యసభ సభ్యురాలు టి.రత్నాబాయి ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ నాయకత్వంలో రాజమండ్రిలోని వై జంక్షన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చెవిలో పువ్వులు పెట్టుకుని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే  నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. చిత్తూరు జిల్లా  మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. చిత్తూరు లో ఉన్న పూతలపట్టు ఎమ్మెల్యే రవి ఇంటిని, సురుటపల్లిలోని  సత్యవేడు ఎమ్మెల్యే హేవులత,   గుంటూరులో నగర కన్వీనర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇళ్లను ముట్టడించారు.   బాపట్లలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసాన్ని పార్టీ పట్టణ కన్వీనర్ ధర్మారావు ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేశారు.

 

 సాయుధ బలగాల రక్షణలో లగడపాటి ఇల్లు  

 విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్  ఇంటి పరిసర ప్రాంతాల్లో వందలాదిగా సాయుధ బలగాలను మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో ఇనుప కంచె వేశారు. బీఎస్‌ఎఫ్ రిజర్వు దళాలతో ఏసీపీ, నలుగురు సీఐలు, ఐదారుగురు ఎస్సైలు, 50 మంది వరకు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడిం చేందుకు యత్నించిన నేతలను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. బలవంతంగా  పోలీసు వాహనంలోకి ఎత్తిపడేసి పటమట స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సామినేని ఉదయభాను, విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్త పి.గౌతమ్‌రెడ్డి తదితరులున్నారు.


 


విజయనగరం జిల్లా  గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇంటిముందు పుష్పాలతో  శాంతి ర్యాలీ చేశారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర,  సీతానగరంలో ఎమ్మెల్యే సవరపు జయమణి  ఇళ్లను ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇల్లు ముట్టడి సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.  శ్రీకాకుళంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు. కాశీబుగ్గలో టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటి గోడపై రాష్ట్ర ద్రోహులుగా మిగల కండి సమైక్యాంధ్రకు మద్దతు పలకండి అంటూ పోస్టర్లను అతికించారు. సీతంపేటలో పాల కొండ ఎమ్మెల్యే  సుగ్రీవులు,, ఆమదాలవలసలో ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇళ్లను ముట్టడించారు.

 

 ఉద్యోగులకు సరుకుల పంపిణీ

 ఉద్యమం కారణంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూ.5లక్షల విలువైన సరుకులు పంపిణీ చేశారు. పుంగనూరులో 165 మంది ఆర్టీసీ కార్మికులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బియ్యం పంపిణీ చేశారు.  బొబ్బిలిలో  వైఎస్‌ఆర్‌సీపీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు లక్షన్నర రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను అందించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top