పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా? | YS Jagan leaves for Rajahmundry to console lorry accident victims | Sakshi
Sakshi News home page

పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా?

Sep 15 2015 3:16 AM | Updated on May 29 2018 2:59 PM

పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా? - Sakshi

పబ్లిసిటీని బట్టి పరిహారమిస్తారా?

‘ప్రాణం ఎవ్వరిదైనా ఒక్కటే.. పరిహారం విషయంలో ప్రభుత్వ విధానం ఒక్కటే అయ్యుండాలి.. అంతేకానీ, పబ్లిసిటీ వస్తుందంటే ఒకలా లేదంటే...

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ప్రాణం ఎవ్వరిదైనా ఒక్కటే.. పరిహారం విషయంలో ప్రభుత్వ విధానం ఒక్కటే అయ్యుండాలి.. అంతేకానీ, పబ్లిసిటీ వస్తుందంటే ఒకలా లేదంటే మరోలా పరిహారం ప్రకటిస్తే ప్రతిఘటన తప్పదు...’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గండేపల్లి వద్ద లారీ బోల్తా పడ్డ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టిన జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
ఉపాధి లేకే వలసలు...

‘‘ఉపాధి పనుల్లేక గ్రామాల్లో బతకలేక వలస వెళ్లిన కూలీలు ఇంటికి తిరిగొస్తూ ప్రమాదం బారిన పడ్డారు. ఉపాధి పనుల్లో రూ.30 నుంచి రూ.80 ఇచ్చినా గిట్టుబాటు కావట్లేదు. బతకడానికి వేరే గత్యంతరం లేక గ్రామాల నుంచి బయటకెళ్లి పనులు చేసుకుంటున్నారు. అలా వెళ్లిన మెట్ట ప్రాంత కూలీలు తిరుగు ప్రయాణంలో గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి సిమెంట్ తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో వస్తున్న లారీ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు.   
 
పబ్లిసిటీ వస్తుందంటేనే భారీ పరిహారం: ఏమయ్యా.. చంద్రబాబుగారూ! మీకు పబ్లిసిటీ వస్తుం దంటే నష్టపరిహారం భారీగా ప్రకటిస్తావు. గోదావరి పుష్కరాల్లో నీవు మేకప్ వేసుకుని సినిమా షూటింగ్ కోసం మనుషులను చంపేస్తే రూ.10 లక్షలు ఇస్తావు. పాపం ఆ పాపను చూడు (దేవి అనే బాలికను చూపిస్తూ).. హ్యాండికాప్డ్.. వాళ్ల నాన్న చనిపోయాడు. బతకడానికి వేరొక ఆధారం లేదు. పనిచేస్తే కానీ పూట గడవని కూలీ కుటుంబం. అలాంటి పేదవారంతా నువ్వు ఉపాధి పనులు చూపకపోవడంతో, బతకడానికి వేరే మార్గం లేక బయట ప్రాంతాలకు వెళ్లారు. తిరిగొస్తూ లారీ ఎక్కి ప్రమాదానికి గురైతే ఎందుకు తక్కువ నష్టపరిహారం ప్రకటించారు?

అదీ నేను వస్తున్నానని తెలిసి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శకు వచ్చినా బాధితులకు ఎలాంటి సహాయమూ ప్రకటించలేదు. మృతదేహాలను చూసెళ్లిపోయారంతే. ఏ ప్రమాదంలో చని పోయినా నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ పాలసీ మారకూడదు. ఈ ప్రమాదం విషయంలోనూ ప్రభుత్వ పాత్ర ఉంది కాబట్టి తగిన పరిహారం ఇవ్వాలి. లేకపోతే దీనిపై కోర్టులో పిటిషన్ వేస్తాం.
 
ఎందుకంత భయం: మృతులకు సంబంధించిన వాళ్లంతా ఇక్కడే ఉన్నారు. కానీ మృతదేహాలను ఊళ్లకు తరలించారు. నేను వస్తున్నానని తెలిసి, పరిహారం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని మృతదేహాలను కనీసం కుటుంబసభ్యులకు అప్పగించకుండా, వారికి తెలియకుండా వారి ఊర్లకు తరలించేశారు. ఒక్కో వాహనంలో మూడేసి మృతదేహాలను కుక్కేశారు. ఎందుకీ హడావుడి తరలింపు? ఎందుకంత భయం? చంద్రబాబు చేస్తున్న పనుల్లో ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వాత పనుల కెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అందుకే వారికి కేవలం ప్రథమ చికిత్స చేసి పంపేయకుండా రూ.2  లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని చంద్రబాబును డిమాండు చేస్తున్నా.  
 
అంతా అవినీతిమయం
ఇసుక నుంచి మట్టి దాకా, పట్టిసీమ నుంచి పోలవరం  దాకా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారు. ఇంత దారుణం దేశంలో ఎక్కడా చూడలేదు. ఇలా సంపాదించిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేని కొనబోయి ఆడియో, వీడియోలతో పట్టుబడ్డారు. ఆ ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి బయటపడటానికి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను సైతం పణంగా పెట్టేశారు. అలా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్న చంద్రబాబు ఒక్కరోజు కూడా సీఎం సీటులో కూర్చోవడానికి అర్హుడు కారు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement