ఓల్గా ‘విముక్త’కు సాహిత్య అకాడమీ పురస్కారం

ఓల్గా ‘విముక్త’కు సాహిత్య అకాడమీ పురస్కారం


సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి ఓల్గా రచించిన చిన్న కథల సంకలనం ‘విముక్త’.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ సంకలనాన్ని డాక్టర్ కె.రామచంద్రమూర్తి, డాక్టర్ ఎ.మంజులత, డాక్టర్ జి.యోహాన్‌బాబుల జ్యూరీబృందం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ‘విముక్త’ సంకలనంలో సమాగమం, మృణ్మయనాదం, సైకత కుంభం, విముక్త, బంధితుడు, రాజ్య+అధికార ఆవరణలో రాముడు, మహిళావరణంలో సీతా- సీతారాం కథలు ఉన్నాయి.ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి కె.శ్రీనివాసరావు 2015ఏడాదికి అవార్డుల వివరాలను తెలిపారు. ఆరు చిన్నకథలు, ఆరు పద్య సంకలనాలు, నాలుగు నవలలు, వ్యాసాలు, విమర్శలకు సంబంధించి ఒక్కో సంకలనానికి అవార్డులు లభించాయి. చిన్న కథల విభాగంలో రచయితలు ఓల్గా (విముక్త- తెలుగు), బిభూత్ పట్నాయక్ (ఒడియా), మాయా రాహి (సింధి)లకు అవార్డులు లభించాయి.ప్రముఖ కవులు రాందర్శ్ మిశ్రా (హిందీ), కేవీ తిరుమళేష్ (కన్నడ), రాంశంకర్ అవస్థి (సంస్కృతం), నవలా విభాగంలో సైరస్ మిస్రీ( ఇంగ్లిష్), కేఆర్ మీరా (మలయాళం), మాధవన్ (తమిళం), నాటికల విభాగంలో షమీం తారీఖ్ (ఉర్దూ), రచనల విభాగంలో అరుణ్ కోపాకర్ (మరాఠీ)లకు పురస్కారాలు లభించాయి. ప్రొఫెసర్ శ్రీకాంత్ బహుల్కర్‌కు భాషా సమ్మాన్ అవార్డును ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న అవార్డుల ప్రదానం ఉంటుంది. రూ.లక్ష నగదు, తామ్రపత్రం, జ్ఞాపికలతో విజేతలను సత్కరిస్తారు.

 

స్త్రీవాదం ఎంత బలంగా ఉందో తెలియాలి: ఓల్గా

సాక్షి, హైదరాబాద్: తెలుగులో స్త్రీవాదం ఎంత బలంగా ఉందో దేశంలోని మిగిలిన రాష్ట్రాల వారందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ప్రముఖ రచయిత్రి ఓల్గా చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించిన సందర్భంగా ఆమె గురువారం సాక్షితో మాట్లాడారు. తన కథల సంపుటి మిగతా అన్ని భారతీయ భాషల్లోకి అనువదించే అరుదైన అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఓల్గా రాసిన విముక్తకథల సంపుటికి ఈ అవార్డు ప్రకటించారు.‘ఈ కథల్లో స్త్రీలు తమంతట తాము ఎలా అధికారం సంపాదించుకోవాలి. తమ అస్తిత్వాన్ని ఎలా తెలుసుకోవాలి. స్త్రీల మధ్య పరస్పర సహకారం ఎలా ఉండాలనే విషయాలున్నాయి. ఈ భావాలు దేశమంతటా పంచుకునే అవకాశం ఈ అవార్డు ద్వారా రావడం ఆనందంగా ఉంది’’ అని ఆమె చెప్పారు. కాగా, ఓల్గాకు సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top