గుండెపోటు ముప్పు.. ట్విట్టర్‌ చెప్పు! | Sakshi
Sakshi News home page

గుండెపోటు ముప్పు.. ట్విట్టర్‌ చెప్పు!

Published Fri, Jan 23 2015 2:03 PM

గుండెపోటు ముప్పు.. ట్విట్టర్‌ చెప్పు!

సామాజిక వెబ్‌సైట్లలో ఎంతోప్రాచుర్యం పొందిన సైట్.. ట్విట్టర్ తన ఖాతాదారుకు గుండెపోటు వచ్చే ముప్పు ఎంతుందో కచ్చితంగా చెప్పగలదని పరిశోధకులు తేల్చారు. ట్విట్టర్‌లో ఖాతాదారులు ఉపయోగించే భాష, వారు వ్యక్తం చేసే భావాలు, ఆ సందర్భంగా వారిలో కలిగే మానసిన ఉద్వేగం, ఆందోళన తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఏ మేరకుందో కచ్చితంగా అంచనా వేయవచ్చని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చెప్పారు.

గుండెపోటుకు కారణమవుతున్న ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల వల్లనే కాకుండా ఇతర అంశాల వల్ల కూడా అత్యంత ప్రమాదకరమైన ‘కరోనరి హార్ట్ డిసీస్’ వస్తుందని తమ పరిశోధనల్లో తేటతెల్లమైందని వారన్నారు. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలకు అడ్డంకులు ఏర్పడడాన్ని వైద్య పరిభాషలో కరోనరి హార్ట్ డీసీస్ అంటారు.భారత్‌లో గుండె జబ్బుగల వారిలో 95 శాతం మంది ఈ జబ్బు కారణంగానే చనిపోతున్నట్లు వైద్య గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రతికూల ప్రభావం చూపే  కోపం, ఉద్రేకం, ఒత్తిడి కారణంగానే అమెరికాలో ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారని వారి ట్వీట్లను అధ్యయనం చేయడం ద్వారా తేలిందని వారంటున్నారు. భావోద్వేగం వల్ల ఒత్తిడికి గురయ్యే వారిలో ఈ ముప్పు తక్కువగా ఉంటోందని చెబుతున్నారు. ఇంకా తమ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం తెల్సిందని, ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేసే వారికన్నా పొరుగువారి ఆగ్రహాన్ని చవిచూసిన వారే ఎక్కువగా గుండె పోట్లకు గురవుతున్నారని వారు తెలిపారు.

Advertisement
 
Advertisement