ఓటర్లకు బంపర్ ఆఫర్
ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి, ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పర్యాటక శాఖ ఓ వినూత్నమైన పద్ధతిని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నుకుంది.
ముంబై : ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చి, ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర పర్యాటక శాఖ ఓ వినూత్నమైన పద్ధతిని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నుకుంది. రాష్ట్రంలో రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి హోటల్స్లో 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఓటు వేసినట్టు ప్రూఫ్ చూపిస్తే చాలు, ఈ డిస్కౌంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చట. ఎన్నికల సందర్భంగా చదువుకున్న వారే, ఓటింగ్లో పాల్గొనకుండా సెలవులు తీసుకుని, సిటీ నుంచి బయటికి వెళ్లిపోతుంటారని, ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రాలయ అధికార వర్గాలు తెలిపాయి.
అయితే, ఓటర్లను ఎలా గుర్తుపడతారని, ఫేక్ ఓటింగ్తో కూడా డిస్కౌంట్ను పొందవచ్చని కొందరు వాదిస్తున్నారు. డిస్కౌంట్ పొందడానికి ఓటర్ ఐడెంటీ కార్డుతో పాటు, వేటు వేసిన అనంతరం పోలింగ్ బూత్లో ఇచ్చే పత్రాన్ని వారు చూపించాల్సి ఉంటుందని టూరిజం అధికారులు తెలిపారు. సాధారణ లేదా అసెంబ్లీ ఎన్నికల పోలిస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆ రాష్ట్రంలో మరి దారుణంగా ఉంటుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజల చైతన్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని పర్యాటకుల్లో ఓటింగ్ చైతన్యాన్ని పెంచడానికి కూడా ఈ ప్రత్యేక స్కీమ్ ఉపయోగపడనుందని వివరించారు. ఈ విషయంపై మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్సెంటివ్ స్కీమ్ హోల్డర్స్, హోటల్స్, రెస్టారెంట్ అసోసియేషన్, టూర్ ఆపరేటర్లతో భేటీ అయ్యారు. 2016 నవంబర్, 2017 ఫిబ్రవరి మధ్యలో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్, ఈ ఎన్నికలు నిర్వహించనుంది.