
ఈ యాప్‌తో సంపాదించవచ్చు!
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తాజాగా సరికొత్త యాప్‌ను భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తాజాగా సరికొత్త యాప్‌ను భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 'ఒపీనియన్ రివార్డ్స్' పేరిట రూపొందిన ఈ యాప్‌లో సర్వేలకు యూజర్లు సమాధానం ఇస్తే చాలు.. వారికి రివార్డుల రూపంలో గూగుల్ చెల్లింపులు జరపనుంది. తమ వ్యక్తిత్వాన్ని సరిపోయే సర్వేలలో యూజర్లు పాల్గొనవచ్చు. ఇందుకుగాను గూగుల్ ఇచ్చే రివార్డ్స్ పలువిధాలుగా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో జరిపే కొనుగోళ్లకు క్రెడిట్ రూపంలోనూ వీటిని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే సింగపూర్, టర్కీ మార్కెట్లలో ఈ యాప్‌ను గూగుల్ విడుదల చేసింది.
యూజర్లు ఈ యాప్‌లో ఒక్కసారి సైన్ అప్ అయి.. సర్వేలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించవచ్చు. ఒక్కసారి సర్వేను విజయవంతంగా పూర్తిచేస్తే గూగుల్ ప్లేస్టోర్ క్రెడిట్స్ రూపంలో చెల్లింపులు ఉంటాయి. ఈ క్రెడిట్స్‌ను వాడుకొని పెయిడ్ సేవలను స్టోర్‌లో పొందవచ్చు. అయితే, ఒక సర్వేను 24 గంటలలోపే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో యూజర్లు పేరు, చిరునామా వంటి ప్రాథమిక సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎవరితో పంచుకోబోమని యాప్ యూజర్లకు హామీగా ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.