అసలే పెళ్లి వేడుక. అంతా కొత్త బట్టలతో చక్కగా అలంకరించుకొని ఆనందంగా వెళుతున్నారు. తెల్లవారు జామున కావడంతో కాస్తంత నిద్రమత్తులోకి జారుకున్నారు.
రాయ్పూర్: అసలే పెళ్లి వేడుక. అంతా కొత్త బట్టలతో చక్కగా అలంకరించుకొని ఆనందంగా వెళుతున్నారు. తెల్లవారు జామున కావడంతో కాస్తంత నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈలోపు భారీ శబ్ధం. తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అందులో వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. వివాహానికి వెళుతూ విషాధాన్ని చవి చూసిన ఈ ఘటన ఛత్తీస్ గఢ్లో చోటుచేసుకుంది. బలాడ్ జిల్లాలో ఆర్మూర్ కాసా గ్రామంలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.
వీరంతా మహిళలే కావడంతో వారి కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. చనిపోయినవారిలో ఓ బాలిక ఉండగా మరో 30 మందివరకు గాయాలపాలయ్యారు. బైయహార్ అనే గ్రామం నుంచి దల్లిరాజరా అనే గ్రామానికి పెళ్లి వేడుక నిమిత్తమై 40 మందితో వెళుతున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. అందరికీ తలకు బలమైన గాయాలయ్యాయి. డ్రైవర్ మత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.