breaking news
Ten killed
-
ముద్ద దిగకముందే మృత్యువాత
అప్పుడప్పుడే అన్నం వండుకున్నారు..తినడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఊహించని ఘటన. నలుదిక్కులూ దద్దరిల్లేలా భారీ పేలుడు. క్షణాల్లోనే పరిస్థితి భీతావహంగా మారిపోయింది. వండుకున్న అన్నం తినకముందే కూలీలు మాంసపు ముద్దలుగా మారిపోయారు. పేలుడు తీవ్రతకు శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని కుక్క నోట కరుచుకుని తీసుకెళ్లడం చూపరులను కలచివేసింది. ఎక్కడి నుంచో వచ్చి దయనీయస్థితిలో మృత్యువాత పడ్డారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు(అర్బన్): ఆలూరు మండలం హత్తిబెళగల్ కంకర క్వారీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న భారీ పేలుడులో 10 మంది కూలీలు దుర్మరణం చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయపడి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వీరంతా ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు నిర్ధారించారు. క్వారీలో నిల్వ ఉంచిన జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ శబ్దాలు సంభవించాయి. ఈ శబ్దాలకు సమీపంలోని హత్తిబెళగల్, అగ్రహారం గ్రామాల్లోని అనేక ఇళ్లు కంపించాయి. ఆయా గ్రామాల్లోని అనేక ఇళ్లలో భోజనం చేస్తున్న వారి కంచాల్లో మిద్దెలపై నుంచి మట్టి పడింది. భారీ శబ్దాలతో పాటు మంటలు నింగికెగసడంతో రెండు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. పేలుడు సంభవించిన సమయంలో విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో ప్రజలందరూ ఇళ్లను వదలిపెట్టి వీధుల్లోకి వచ్చారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటు రాత్రంతా జాగరణ చేశామని గ్రామస్తులు చెప్పారు. మూడు, నాలుగేళ్లుగా క్వారీ పేలుళ్ల వల్ల తమ ఇళ్లు కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయని, వెంటనే నిలుపుదల చేయాలని తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు అనేక వినతి పత్రాలు అందించినా, ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు. హత్తిబెళగల్‌లో 50 ఇళ్లకు నష్టం హత్తిబెళగల్ గ్రామ సమీపంలోని కొండల్లో విఘ్నేశ్వర క్రషర్స్ చేస్తున్న బ్లాస్టింగ్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు శబ్దాలకు సమీపంలోని అగ్రహారం, హత్తిబెళగల్ గ్రామాల్లోని ఇళ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. హత్తిబెళగల్ గ్రామంలోని చాకలివీధిలోనే దాదాపు 30 మట్టి మిద్దెలు కంపించి మట్టి కుప్పలు కుప్పలుగా ఇళ్లలో పడిపోయింది. మరికొని ఇళ్ల గోడలు పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఎప్పుడు తమ ఇళ్లు కూలిపోతాయోననే భయంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కైలాష్ నీవెక్కడ? కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): క్వారీ పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కూలీలు ఒడిశా రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్ కైలాష్ ద్వారా ఇక్కడికి వచ్చారు. నెలకు రూ.12,000 కూలితో అగ్రిమెంట్ అయి క్వారీలో పనికి చేరారు. ఈ ఘటనలో మృతి చెందిన పది మందిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్‌కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ మృతదేహాలను గుర్తించారు. మిగిలిన 8 మంది మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. వీరిని కాంట్రాక్టర్ కైలాష్ మాత్రమే గుర్తు పట్టేందుకు వీలుంది. తినే అన్నంలో మట్టి పడింది పగలంతా పొలాల్లో పనిచేసి వచ్చిన మేము రాత్రి భోజనం చేసే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇంటి మిద్దెలో నుంచి మట్టి అన్నం తినే కంచంలో పడింది. ఇళ్లంతా మట్టి నిండుకుంది. ఏమి జరుగుతోందో తెలియక ఎంతో భయపడ్డాం. కరెంట్ కూడా లేకపోవడంతో భయం భయంగా రాత్రంతా గడిపాం. మా ఇంటితో పాటు కొండను ఆనుకొని ఉన్న చాకలివీధిలోని అన్ని ఇళ్లూ వణికిపోయాయి. ఇళ్లు పడిపోతాయేమోనని భయపడ్డాం. – కవిత, హత్తిబెళగల్ మృత్యువును తప్పించుకున్న ముగ్గురు కూలీలు క్వారీలో జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. వీరిలో 15 మంది ఒక షిఫ్టుగా హత్తిబెళగల్ కొండల్లో బ్లాస్టింగ్ చేస్తున్నారు. పగలు షిప్టు పూర్తి చేసుకున్న జార్ఖండ్ కూలీలు ఏడుగురితో పాటు మరికొందరు ఒడిశాకు చెందిన కూలీలు బ్లాస్టింగ్ జరుగుతున్న కొండల సమీపంలోనే రేకుల షెడ్డులో వంట చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జార్ఖండ్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు సొంత పనిమీద సమీపంలోని ఆలూరుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో భారీ విస్పోటనం సంభవించడంతో జార్ఖండ్‌కు చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్ (40), బూంచి కుమార్ పాశ్వాన్ (35) తదితరులు అక్కడికక్కడే మృతి చెందగా, దిలీప్ పాశ్వాన్ (35), వికాస్ పాశ్వాన్ (20) తో పాటు మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారు. పనిమీద బయటకు వెళ్లిన అక్షయ్‌సింగ్ పాశ్వాన్, బారీకర్ పరశురాం, ఆకాష్ పరశురాం మాత్రం మృత్యువు నుంచి తప్పించుకున్నారు. వీరంతా జార్ఖండ్ రాష్ట్రం మీరాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బానా ప్రాంతానికి చెందిన వారుగా చెబుతున్నారు. ఆ దృశ్యం..కన్నీరు తెప్పించింది! విస్ఫోటం సంభవించిన ప్రాంతంలో శనివారం ఉదయం ఒక కుక్క మృతి చెందిన ఓ కార్మికుని కాలును నోటితో కరచుకొని ఈడ్చుకెళ్తున్న దృశ్యం చూపరులకు కన్నీరు తెప్పించింది. çసంఘటన అనంతరం ప్రమాద తీవ్రతను బట్టి జరగకూడని సంఘటనలు ఎక్కడ చోటు చేసుకుంటాయో, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమోననే భావనతో పోలీసులు రాత్రికి రాత్రే మృతదేహాలను మూటగట్టి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. అలాగే శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు సంఘటన జరిగిన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతరులెవ్వరినీ ఆ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టం చేశారు. కానీ .. మృతుల శరీర భాగాలు ఎక్కడపడితే అక్కడ పడినా ఎవరూ పట్టించుకోలేదు. అలాగే ఈ ఘోర దుర్ఘటనలో ఒక టిప్పర్, రెండు ట్రాక్టర్లు పూర్తిగా కాలిపోవడంతో పాటు వాటి విడి భాగాలు ఉవ్వెత్తున ఎగిసి ఫర్లాంగు దూరంలో అక్కడక్కడా పడిపోయాయి. కార్మికులు వేసుకున్న షెడ్డు పూర్తిగా కాలిపోయింది. వారికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఇతరత్రా సామాన్లన్నీ మంటల్లో కాలిపోయాయి. చాలా ఎత్తుకు మంటలు ఎగిసిపడడంతో కార్మికులు నివాసం ఉన్న షెడ్డు, పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన ప్రాంతం అంతా బూడిదమయమైంది. కేవలం రేకుల షెడ్డు పైకప్పు మాత్రం అక్కడక్కడా వేలాడుతూ కనిపించింది. పేలుడు పదార్థాలతో పాటు డీజిల్ డ్రమ్ములు కూడా అక్కడే ఉండడంతో అవి కూడా పేలిపోయాయి. క్వారీ సీజ్ చేయాలి ఆలూరు: హత్తిబెళగల్ గ్రామంలోని కొండపై నిర్వహిస్తున్న క్వారీని వెంటనే సీజ్ చేయాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డిమాండ్ చేశా రు. శనివారం పేలుడు ఘటన స్థలానికి చేరుకుని పేలుళ్లకు గల కారణాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ పేలుళ్లు జరిగి కార్మికులు మృతి చెందారన్నారు. గతంలో క్వారీని బంద్ చేయించాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారుల అండదండలతోనే క్వారీ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలలని డిమాండ్ చేశారు. అలాగే క్వారీ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పోస్టుమార్టం పూర్తి కర్నూలు (హాస్పిటల్)/ఆలూరు: పేలుడులో చనిపోయిన పదిమంది మృతదేహాలకు కర్నూలు పెద్దాస్పత్రి మార్చురీలో ఫొరెన్సిక్ హెచ్‌వోడీ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శంకర్‌నాయక్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రంగయ్య పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను అక్కడే ఉంచారు. వాటి తరలింపుపై అయోమయం నెలకొంది. మృతదేహాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి తరలించి..అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఒడిశాకు తరలించాలని భావించినప్పటికీ, అందులో స్థానికులెవ్వరైనా ఉంటే కొత్త సమస్యలు తలెత్తుతాయన్న సందిగ్ధంలో అధికారులు తరలింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.అయితే.. ప్రస్తుతానికి గుర్తించిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కంచన్ కుమార్ పాశ్వాన్, బూంచి కుమార్ పాశ్వాన్ల మృతదేహాలను మాత్రమే బంధువులకు అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మిగిలిన 8 మృతదేహాల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అక్రమ క్వారీలపై చర్యలు: రాష్ట్రంలోని అక్రమ క్వారీలపై సమగ్ర విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మైనింగ్ మంత్రి సుజయ కృష్ణరంగారావు తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీలో పనిచేసే కార్మికుల వివరాలను ఆయా సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.శనివారం వీరు కర్నూలు పెద్దాస్పత్రిలో కూలీల మృతదేహాలను పరిశీలించారు. అలాగే పేలుళ్లు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ఘటనపై విచారణ కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ కె.సత్యనారాయణను నియమించారు. మంత్రుల వెంట డీజీపీ ఠాకూర్, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తదితరులు ఉన్నారు. -
హృదయ విదారకం...
రామన్నపేట ఇంద్రపాలనగరంవద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న గర్భిణీ, వైద్యపరీక్షలు చేయించేందుకు తల్లిని తీసుకువెళ్తున్న కూతురు, తొమ్మిదినెలల పసికందు మృతిచెందిన తీరు హృదయ విదారకంగా ఉంది. పరీక్షరాసేందుకు వెళుతూ... భువనగిరికి చెందిన కందారి అశ్విని(20) డిగ్రీ సప్లమెంటరీపరీక్ష రాసేందుకు తనతల్లిగారి ఊరైన రామన్నపేటకు బయలుదేరింది. మార్గమధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందింది. మృతురాలు గర్భిణీ కూడా కావడంతో ఆమె మృతి కుటుంబంలో విషాదాన్ని నింపింది. వైద్యపరీక్షలుకు వెళుతూ... రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సయ్యద్సాజిదాబేగం(21) రామన్నపేటకు వెళ్లి తనతల్లికి జుబెదాబేగానికి వైద్యపరీక్షలు చేయించేందుకు ఇంద్రపాలనగరంలోనే బస్సు ఎక్కింది. రెండు నిమిషాలకే ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఆమెతండ్రి ఖలీల్ ప్రమాదస్థలాన్ని చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలై ఉన్న సాజిదాబేగాన్ని బస్సులో నుంచి కిందికి దింపగాన తనవడిలో కూర్చోబెట్టుకున్నాడు. కొనఊపిరితో ఉన్న సాజిదాబేగం తనతండ్రి ఒడిలో కన్నుమూసి అనంతలోకాలకు వెళ్లింది. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి బయలుదేరిన కూతురు, ఆస్పత్రిలో శవమై పడుకున్నావా అంటూ తల్లిరోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. -
డెత్..జర్నీ
ఇంద్రపాలనగరం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ బస్సుడ్రైవర్‌తో సహా 10 మంది దుర్మరణం హాహాకారాలతో దద్దరిల్లిన ప్రమాదప్రాంతం నార్కట్‌పల్లి డిపోనకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు భువనగిరి-నల్లగొండ మధ్య రోజూ మూడు ట్రిప్పులు తిరుగుతుంది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు నల్లగొండ నుంచి భువనగిరికి వచ్చింది. క్యాంటిన్లో డ్రైవర్, కండక్టర్ భోజనం చేశారు. 2.45 గంటలకు నల్లగొండకు బయలు దేరారు. 3.35 గంటలకు రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం వద్దకు చేరుకుంది. బస్టాప్ వద్ద కొందరు ప్రయాణికులు ఎక్కి వెనక సీట్లలో కూర్చున్నారు. బస్సు ముందుకు కదిలింది. 3.40 గంటలకు కండక్టర్ రాజేష్ టిక్కెట్లు ఇవ్వడానికి వెనక్కి వెళ్లాడు. ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఘోరం జరిగింది. మృతులు వీరే.. 1)యాస మల్లారెడ్డి(45) 2)కాదారి అశ్విని(20) 3) భూపతి శ్రీదేవి (32) 4) సయ్యద్ సాజిదా బేగం (18) 5) అంతటివెంకన్న (45) 6) గోనె శ్రీనివాస్ (40) 7) తోట విజయలక్ష్మి (22) 8) పసుపుల నిర్మల (22), 9) పసుపుల జగదీశ్ (9నెలలు) వీరిద్దరూ తల్లి,కుమారుడు. 10) వేముల యాదిగిరి (40) -
రోడ్డు ప్రమాదంలో 11 మంది మహిళలు మృతి
రాయ్‌పూర్: అసలే పెళ్లి వేడుక. అంతా కొత్త బట్టలతో చక్కగా అలంకరించుకొని ఆనందంగా వెళుతున్నారు. తెల్లవారు జామున కావడంతో కాస్తంత నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈలోపు భారీ శబ్ధం. తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అందులో వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. వివాహానికి వెళుతూ విషాధాన్ని చవి చూసిన ఈ ఘటన ఛత్తీస్ గఢ్‌లో చోటుచేసుకుంది. బలాడ్ జిల్లాలో ఆర్మూర్ కాసా గ్రామంలో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మహిళలే కావడంతో వారి కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకమైంది. చనిపోయినవారిలో ఓ బాలిక ఉండగా మరో 30 మందివరకు గాయాలపాలయ్యారు. బైయహార్ అనే గ్రామం నుంచి దల్లిరాజరా అనే గ్రామానికి పెళ్లి వేడుక నిమిత్తమై 40 మందితో వెళుతున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. అందరికీ తలకు బలమైన గాయాలయ్యాయి. డ్రైవర్ మత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
లోయలో పడిన బస్సు.. పదిమంది మృతి
గర్వా(జార్ఖండ్): జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. 25మందికి పైగా గాయాలపాలయ్యారు. బీహార్‌లోని ససరాం నుంచి చత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌కు వెళ్లాల్సిన బస్సు సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జార్ఖండ్‌లోని గార్వా-అంబికాపూర్ రోడ్డులో అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. దీంతో అధిక ప్రాణనష్టం చోటుచేసుకుంది. గాయాలపాలయినవారిని ఆస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ - ట్రక్కు ఢీ -10మంది మృతి
-
రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
పుణె - సతారా రహదారిపై సోమవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న బస్సును వెనకు నుంచి కంటెయినర్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాల్వలో పడింది. ఆ దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.