
కోర్టును ధిక్కరిస్తున్నారా?
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
* పంచాయతీరాజ్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం ఆగ్రహం
* మీరు తలచుకుంటే 24 గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వగలరు
* 3 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుంటే ఎలా?
* గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు కూడా మీరు పాటించలేదు
* లోక్‌సభ ఎన్నికలతో మీకొచ్చిన ఇబ్బందేంటి?
* సోమవారానికల్లా నోటిఫికేషన్‌పై చర్యలు తీసుకోండి
* లేదంటే కోర్టు ధిక్కరణగానే భావిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై సుప్రీం కోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. గత ఏడాది ఫిబ్రవరి 18నే తాము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా ఇప్పటివరకు నిర్వహించకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలుచేయకపోవడంపై న్యాయవాది ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, గోపాలగౌడలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. దాదాపు 15 నిమిషాలసేపు ఈ కేసును న్యాయస్థానం విచారించింది.
లోక్‌సభ ఎన్నికలతో సంబంధమేంటి?
‘గత ఏడాది ఫిబ్రవరి 18నే న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కానీ మీరు ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదు..’ అని న్యాయమూర్తులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. దీనికి ఎన్నికల సంఘం తరపు న్యాయవాది మనోజ్ సక్సేనా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. జూన్ 30లోపు ఈ ఎన్నికలు నిర్వహిస్తాం. అందుకు అవకాశం ఇవ్వాలి.. ఇప్పటివరకు ఇందుకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్రం ఖరారు చేయలేదు. దీనిపై పలు లేఖలు రాశాం..’ అని విన్నవించారు.
దీనికి న్యాయమూర్తులు స్పందిస్తూ ‘లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏంటి.. వాటికి వీటికి సంబంధం ఏంటి.. రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు తీసుకోవచ్చు..’ అని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున న్యాయవాది సుచరిత మాట్లాడుతూ.. గత ఫిబ్రవరి 18 తరువాత నుంచి ఇప్పటివరకు ఇందుకు ప్రభుత్వం తరఫున జరిగిన ప్రక్రియను వివరించారు. జులైలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించామని, కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ముగిసినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల సమ్మె కారణంగా చేయలేకపోయామని వివరించారు.
ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడమే మిగిలి ఉందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు విన్న న్యాయమూర్తులు.. మూడేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటిఫికేషన్ విషయంలో సోమవారానికల్లా సానుకూల చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. కేసును సోమవారానికి వాయిదావేశారు.