రజనీ రావడం ఖాయం

రజనీ రావడం ఖాయం - Sakshi


రెండు వారాల్లో కొత్త పార్టీ ప్రకటన

గాంధేయ మక్కల్‌ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్‌ వెల్లడి

రాజకీయవేత్తలతో రజనీ రహస్య మంతనాలు




సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని తమిళరువి మణియన్‌ వెల్లడించారు. ‘‘ప్రజలకు మేలు చేయాలంటే  రాజకీయాల్లోకి రావాలి..  తప్పకుండా వస్తాను’’ అని తలైవా తనతో అన్నట్లుగా ఆయన వివరించారు.



సాక్షి ప్రతినిధి, చెన్నై: రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఖాయమని గాంధేయ మక్కల్‌ ఇయక్కం అధ్యక్షులు తమిళరువి మణియన్‌  తెలిపారు. చెన్నైలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని ఆయన ఇంటిలో ఇటీవల రెండుసార్లు రజనీని కలుసుకున్నానని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సుమారు మూడుగంటలకు పైగా చర్చించినట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలపై రజనీ ఎంతో అభిమానం, ప్రేమను చాటుకున్నారని, నాలుగు దశాబ్దాల క్రితం చెన్నై చేరుకున్న తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏమైనా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ‘ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలి, తప్పకుండా వస్తాను’ అని తనతో అన్నట్లుగా తమిళరువి తెలిపారు. ఆస్తుల కోసం ఎంతమాత్రం రాజకీయ ప్రవేశం చేయదలుచుకోలేదని, కామరాజనాడార్, అన్నాదురై ఆదర్శంగా నిస్వార్థ రాజకీయాలు సాగించాలని ఆయన ఆశిస్తున్నారని చెప్పారు. మరో రెండు వారాల్లో పార్టీని, అజెండాను ప్రకటిస్తారని తెలిపారు.



పలువురితో రజనీ చర్చలు

రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్‌ ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులతో చర్చలు జరుపుతూ అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. తమిళరువితోపాటూ తుగ్లక్‌ పత్రిక సంపాదకులు ఎస్‌ గురుమూర్తితో అనేకసార్లు సమావేశమయ్యారు. అలాగే మరోసారి అభిమానులతో సమావేశం అయ్యేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఐదురోజులపాటూ అభిమానులతో సమావేశమైనపుడు రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ తరువాత కాలా చిత్ర షూటింగ్‌లో బిజీ అయిపోయారు. ఇటీవల మరలా రాజకీయాలపై దృష్టి పెట్టి పలువురిని కలుసుకుంటున్నారు. అభిమానులతో రెండో విడత సమావేశాలు ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి పార్టీని ప్రకటిస్తారని అంటున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top