
ద్రోహుల్ని నమ్మొద్దు.. సాగనంపుదాం
ద్రోహుల్ని నమ్మొద్దు... మనం ఏమిటో నిరూపిద్దామని ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు.
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ
- పన్నీరు కాకమ్మ బెదిరింపులకు భయపడను
- పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో రాజకీయ సమీక్ష
సాక్షి, చెన్నై: ద్రోహుల్ని నమ్మొద్దు... మనం ఏమిటో నిరూపిద్దామని ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు. అమ్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా డీఎంకే పక్షపాతిగా మారిన పన్నీరును శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపుదామని ఆవేశపూరిత ప్రసంగాన్ని సాగించారు. సీఎం పన్నీరు సెల్వం ప్రకటనతో అన్నాడీఎంకేలో మొదలైన ప్రకంపనను తిప్పికొట్టేందుకు శశికళ ఇచ్చిన పిలుపుతో అన్నాడీఎంకే శాసనసభా పక్షం, పార్టీ కార్య నిర్వాహకులు ఆగమేఘాలపై ఉదయాన్నే చెన్నైకు చేరుకున్నారు. శశికళ బుధవారం ఉదయం 11:30 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని గంటన్నర పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్య నిర్వాహకులతో రాజకీయ సమీక్ష జరిపారు. అనంతరం ఆవేశంగా మాట్లాడారు.
అమ్మ కలల సాకారానికే ముందుకు వచ్చా...
అమ్మ జయలలితతో కలిసి 33 ఏళ్లు ఎన్నో కష్టనష్టాల్ని అనుభవించానని, ఎందరో ద్రోహులు, శత్రువులు, వారి కుట్రలను ఎదుర్కొంటూ, తిప్పికొట్టామని శశికళ గుర్తు చేశారు. అమ్మ మరణం తర్వాత పార్టీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు సాగుతున్నాయని హెచ్చరించారు. ఇప్పటివరకు అన్నింటా గెలిచామని, ఇకముందు కూడా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ మరణం తర్వాత పన్నీరుతో పాటు పలువురు తనను సీఎం పగ్గాలు చేపట్టాలని కోరినా, అప్పుడున్న మానసిక స్థితిలో తిరస్కరించినట్టు తెలిపారు. అమ్మ మెప్పు పొందిన పన్నీరుకే మళ్లీ అవకాశం కల్పిస్తూ పట్టం కట్టినట్టు చెప్పారు. కానీ పన్నీరుసెల్వం తీరు రానురాను పక్కదారి పట్టడాన్ని గుర్తించాకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. సీఎం బాధ్యతలు చేపట్టాలని తీర్మానాన్ని తీసుకొచ్చిన 42 గంటల అనంతరం మాట మార్చడం బట్టి చూస్తే, ఆయన వెంట డీఎంకే ఉందన్న విషయం స్పష్టం అవుతోందని ఆరోపించారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే విధంగా కాకమ్మ బెదిరింపులు, ఆరోపణలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. కాకమ్మ బెదిరింపులకు భయపడే వాళ్లెవరూ ఇక్కడలేరని హెచ్చరిస్తూ ప్రసంగాన్ని ముగించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తాను ఏ విచారణకైనా సిద్ధమనిæ స్పష్టం చేశారు. అనంతరం శశికళ వర్గీయులు మీడియా ముందుకు వస్తూ సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టుగా తెలపడం గమనార్హం.
నేడు శశికళ బలనిరూపణ..
తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ విముఖత వ్యక్తం చేస్తున్నారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి శశికళ సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహించాలని భావించారు. అయితే గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం చెన్నైకి వస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించడంతో ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నారు. గురువారం చెన్నైలో గవర్నర్‌ను కలవడం కోసం శశికళ అపాయింట్‌మెంట్ కోరారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం సాయంత్రం చెన్నై చేరుకున్నాక రాజ్‌భవన్‌లో ఎమ్మెల్యేలతో బల నిరూపణకు చిన్నమ్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.