పోయెస్‌ గార్డెన్‌లో ఉద్వేగభరిత వాతావరణం! | Sasikala breaks down as she accepts AIADMK resolution | Sakshi
Sakshi News home page

పోయెస్‌ గార్డెన్‌లో ఉద్వేగభరిత వాతావరణం!

Dec 29 2016 2:14 PM | Updated on Sep 4 2017 11:54 PM

పోయెస్‌ గార్డెన్‌లో ఉద్వేగభరిత వాతావరణం!

పోయెస్‌ గార్డెన్‌లో ఉద్వేగభరిత వాతావరణం!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లో గురువారం ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసమైన పోయెస్‌ గార్డెన్‌లో గురువారం ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టే సందర్భంగా జయలలిత నెచ్చెలి శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనై.. కంటతడి పెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాల్సిందిగా పార్టీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేయగా.. దానిని తమిళనాడు ప్రస్తుత సీఎం పన్నీరు సెల్వం శశికళకు అందజేశారు. ఈ సందర్భంగా శశికళ కన్నీరు కార్చారు. అంతకుముందు పూలమాలతో అలకరించి ఉన్న జయలలిత చిత్రపటానికి శశికళ, పార్టీ నేతలు చేతులుజోడించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చిన్నమ్మకు జేజేలు పలుకుతూ పలువురు నేతలు నినాదాలు చేశారు. అనంతరం పార్టీ అధినేత్రిగా పగ్గాలుచేపట్టి పార్టీని నడిపించాల్సిందిగా కోరుతూ పన్నీర్‌ సెల్వం తీర్మానప్రతిని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై మాట్లాడుతూ పార్టీ నాయకురాలిగా తమకు మార్గదర్శకం చేయాలంటూ ఆమెను ఉత్సాహ పరిచారు. వారి విజ్ఞప్తిని ధ్రువీకరించిన శశికళ అనంతరం నివాసంలోకి వెళ్లిపోయారు. జయలలిత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా మూడు దశాబ్దాలు బాధ్యతలు నిర్వహించగా.. ఇకముందు ఆమె వారసురాలిగా శశికళ ఆ పగ్గాలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement