ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు | Robert Mugabe bash faces massive protest | Sakshi
Sakshi News home page

ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు

Published Sun, Feb 26 2017 9:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు

ఆర్భాటంగా వేడుకలు.. జనం మండిపాటు

జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 93వ జన్మదినం సందర్భంగా భారీ ఖర్చుతో విందు విలాసాలు ఏర్పాటు చేశారు.

మటోబో: అదుపులో లేని ద్రవ్యోల్బణం, ఆగని ఆకలి చావుల మధ్య కూడా జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే 93వ జన్మదినం సందర్భంగా భారీ ఖర్చుతో విందు విలాసాలు ఏర్పాటుచేశారు. శనివారం బులావాయో పట్టణం ఆవల తన పార్టీ జాను–పీఎఫ్‌(జెడ్‌ఏఎన్‌యూ–పీఎఫ్‌) నిర్వహించిన వేడుకకు వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హాజరయ్యారు. మంగళవారం పుట్టిన రోజు జరుపుకున్న ముగాబే గౌరవార్థం వారంపాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మీడియాలో అయితే ఆయన మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

దేశం తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్న సమయంలో ఇంత హంగూ ఆర్భాటాలతో వేడుకలు జరపడం ప్రజలను, ప్రతిపక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. వచ్చిన అతిథుల కడుపు నింపడానికి స్థానిక ప్రజలు తమ పశువులు అమ్ముకోవడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. 1980 నుంచి నిరాటకంగా కొనసాగుతున్న ముగాబే పాలనాకాలంలో అసమ్మతి అణచివేత, ఓట్ల రిగ్గింగ్, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లాంటి మచ్చలెన్నో ఉన్నాయి. ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన దాఖలాలు కోకొల్లలు. ఉత్తరకొరియా శిక్షణలో రాటుదేలిన జింబాబ్వే బలగాల చేతుల్లో సుమారు 20 వేల మంది చనిపోయారని ఓ అంచనా.

వయసు మీద పడుతున్నా గద్దె దిగేదిలేదని ఓ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముగాబే స్పష్టం చేశారు. ఆయన కళ్లు మూతలుపడుతుండగా, మాటకు మాటకు మధ్య విరామం వల్ల స్వరం తడబాటుతో ఆ ఇంటర్వ్యూ సాగింది. తన పార్టీ కోరితేనే పదవి నుంచి తప్పుకుంటానని ముగాబే చెప్పారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలకు పార్టీ ముగాబేనే తన అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement