సెబీ షాక్‌తో ఆర్‌ఐఎల్‌ డీలా | Reliance Industries' scrip drops 1.40% after Sebi penalty order | Sakshi
Sakshi News home page

సెబీ షాక్‌తో ఆర్‌ఐఎల్‌ డీలా

Mar 27 2017 10:18 AM | Updated on Sep 5 2017 7:14 AM

ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో సంవత్సరంపాటు సెబీ నిషేధంతో సోమవారం ఈ కౌంటర్లో మదుపర్ల అమ్మకాలు భారీగా కొనసాగుతున్నాయి.


ముంబై:  ముకేశ్‌ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కు సెబీ షాక్‌ భారీగానే తాకింది.  ఈక్విటీ డెరివేటివ్ మార్కెట్ కార్యకలాపాల్లో  సంవత్సరంపాటు  సెబీ నిషేధంతో  సోమవారం ఈ కౌంటర్లో మదుపర్ల అమ్మకాలు  భారీగాకొనసాగుతున్నాయి.   ఒక దశలో దాదాపు 2 శాతానికి పైగా పతనమైంది.    గతం ముగిం‍పుతో పోలిస్తే ఆర్ఐఎల్‌ షేరు ధర  1.57 శాతం నష్టపోయి 1,266.50 వద్ద  బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది. అటు ఆరంభంలోనే  బలహీనంగా ఉన్న మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బలహీనంగా మొదలైన మార్కెట్లలో ఆర్‌ఐఎల్‌  అమ్మకాల ప్రభావం బాగా కనిపిస్తోంది.  దీంతో సెన్సెక్స్‌ 155 పాయింట్లు క్షీణించి 29,266వద్ద,  నిఫ్టీ 53 పాయింట్లు కోల్పోయి 9,055 దిగువకు చేరింది.

 పదేండ్ల క్రితం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో(ఎఫ్ అండ్ వో) మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడి మూటగట్టుకున్న రూ.447 కోట్ల సొమ్మును 12 శాతం వార్షిక వడ్డీతో సహా కలిపి వెన‌క్కు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థకు ఇటీవల  సెబీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు  నవంబర్ 29, 2007 నుంచి 12 శాతం చొప్పున లెక్కగట్టి  సుమారు రూ.500 కోట్లు  చెల్లించాలని తెలిపంది. అంటే, ఈ ఆదేశాలతో సంస్థపై  దాదాపు రూ.1,000 కోట్లు  భారం పడనుంది. ఈ సొమ్మును 45 రోజుల్లో చెల్లించాలని  సెబీ హోల్ టైం మెంబ‌ర్‌ మ‌హాలింగం  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

స్టాక్ ఎక్సేంజ్‌లలో ఈక్విటీ డెరివేటివ్‌ల ఎఫ్ అండ్ వో సెగ్మెంట్ ట్రేడింగ్‌లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనకుండా రిలయన్స్, మరో 12 కంపెనీలపై ఏడాది కాలం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రిల‌య‌న్స్ పెట్రోలియమ్‌(ఆర్‌పీఎల్‌)విలీనమైన సందర్భంలో ఆర్‌పీఎల్‌ షేర్లలో ఫ్యూచర్స్‌ అండ్‌ డెరివేటివ్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) సెగ్మెంట్లో అక్రమంగా ట్రేడింగ్‌ జరిగిందన్న 2007 నాటి కేసుకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ పెట్రోలియంను ఇప్పటికే మాతృ సంస్థలో విలీనం చేశారు. ఈ కేసును సెటిల్ చేసుకుందామని గతంలో రిలయన్స్ కోరినప్పటికీ సెబీ నిరాకరించింది. కాగా ఈ ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిల్లేట్‌ ట్రిబ్యూనల్‌(శాట్‌)లో  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  సవాల్‌ చేయనుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement