నరేంద్ర మోడీపై మాజీ డీజీపీ వంజారా రాసిన లేఖ విషయంలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో రాజ్యసభ పావుగంట పాటు వాయిదా పడింది.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై ఆ రాష్ట్ర మాజీ డీజీపీ వంజారా రాసిన లేఖ విషయంలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో రాజ్యసభ పావుగంట పాటు వాయిదా పడింది. గురువారం సభ సమావేశమైన కొద్ది సేపటికే జేడీయూ, సమాజ్వాదీ సభ్యులు ఆ లేఖ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారిగా గళమెత్తారు. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభ్యులకు ఎంతగా విజ్ఞప్తి చేసినా సభ అదుపులోకి రాలేదు. దీంతో ఆయన సభను పావుగంట పాటు వాయిదా వేశారు.
మూడు బూటకపు ఎన్కౌంటర్ల కేసులో ఆరోపణలున్న ఐపీఎస్ అధికారి వంజారా మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తనను మోసం చేశారని ఆరోపణలతో భారీ లేఖాస్త్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీపైన, మాజీ హోం మంత్రి అమిత్ షాపైన తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఉగ్రవాదులని ఆరోపణలున్నవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చడానికి వారిద్దరూ ప్రోత్సహించారని ఆయన చెప్పారు.