పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2 | Police search for ‘missing’ kids all night, turns out they went to watch Baahubali 2 | Sakshi
Sakshi News home page

పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2

May 26 2017 10:24 AM | Updated on Sep 5 2017 12:03 PM

పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2

పోలీసులకు నిద్రలేకుండా చేసిన బాహుబలి 2

రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రరాజం బుధవారం రాత్రంతా జైపూర్‌ పోలీసులకు నిద్రలేకుండా చేసింది.

జైపూర్‌: ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘బాహుబలి 2’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా రికార్డుల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రరాజం బుధవారం రాత్రంతా జైపూర్‌ పోలీసులకు నిద్రలేకుండా చేసింది.

వివరాల్లోకి వెళ్లితే.. శక్తినగర్‌ ప్రాంతంలో ముగ్గురు చిన్నారులు తప్పిపోయినట్టు బుధవారం సాయంత్రం జోత్వారా పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. 8 నుంచి 13 ఏళ్ల వయసున్న ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు సోదరులు, వారి స్నేహితుడు ఉన్నాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నగరాన్ని జల్లెడ పట్టారు. ‘నగరంలో చాలా చోట్ల గాలించాం. ఇన్‌ఫార్మర్ల సహాయం తీసుకున్నాం. రాత్రంతా పెట్రోలింగ్‌ వాహనాలతో సిటీ అంతా తిరిగామ’ని జోత్వారా ఎస్‌ఐ గురుదత్‌ సైనీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున చిన్నారుల ఆచూకీ తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జోత్వారాలోని ఓ ఆలయం వద్ద చిన్నారులను కనుగొన్నారు. తర్వాత చిన్నారుల చెప్పిన మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు. బాహుబలి 2 సినిమా చూడడానికి వెళ్లి తప్పిపోయామని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. 

‘సమీపంలో ఉన్న ధియేటర్‌లో బాహుబలి 2 సినిమాకు చూడటానికి వెళ్లమని చెప్పారు. టిక్కెట్లు దొరక్కపోవడంతో వాళ్లు సినిమా చూడలేకపోయారు. ఆలస్యంగా వెళితే ఇంట్లో తిడతారన్న భయంతో తిరుగు పయనమయ్యారు. కంగారులో దారి తప్పిపోయామని’  చిన్నారులు చెప్పినట్టు జోత్వారా పోలీసు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆస్‌ మహ్మద్‌ తెలిపారు. ముగ్గురు చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు చెప్పారు. చిన్నారులు సురక్షితంగా ఉన్నారని, వారిని తమ ఇళ్లలో దించామని స్టేషన్‌ హౌస్‌ అధికారి వెల్లడించారు. ‘రాత్రంతా నిద్ర లేదు. ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకోవాల’ని ఆయన చెప్పడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement