
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
భువనేశ్వర్: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఒడిశా జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురైంది. అధికార బీజేడీ మెరుగైన ఫలితాలతో పట్టునిలబెట్టుకోగా, బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.
ఒడిశాలో మొత్తం 849 జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. శనివారం సాయంత్రం 6 గంటలకు 741 స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేడీ 410, బీజేపీ 269 సీట్లను గెల్చుకున్నాయి. కాగా కాంగ్రెస్ పార్టీ కేవలం 46 చోట్ల గెలిచింది. ఇతరులు మరో 16 సీట్లను సొంతం చేసుకున్నారు. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సివుంది.
మహారాష్ట్రలో జరిగిన 10 కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. బీజేపీ 8, శివసేన 2 కార్పొరేషన్లలో అత్యధిక సీట్లు గెల్చుకున్నాయి. ఇక ప్రతిష్టాత్మకమైన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు చుక్కెదురైంది. గత ఎన్నికల్లో 52 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి 31 సీట్లకే పరిమితమైంది. చాలాచోట్ల ఈ రెండు పార్టీలు ఐదు, ఆరో స్థానాలకు పడిపోయాయి. ఇక 25 జిల్లా పరిషత్‌లకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కనబరిచింది. కాంగ్రెస్‌కు పట్టున్న ప్రాంతాల్లోనూ బీజేపీ దూసుకుపోయింది.