నల్లధనం ఎంత వెలికివచ్చిందో తెలియదు! | Sakshi
Sakshi News home page

నల్లధనం ఎంత వెలికివచ్చిందో తెలియదు!

Published Tue, Sep 5 2017 1:22 PM

నల్లధనం ఎంత వెలికివచ్చిందో తెలియదు! - Sakshi

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత ఎంత నల్లధనం వెలికివచ్చిందో తమకు సమాచారం లేదని ఆర్బీఐ పార్లమెంటు స్థాయి సంఘానికి తెలిపింది. అదేవిధంగా రద్దైన నోట్ల బదిలాయింపులో ఎంత అక్రమధనం చట్టబద్ధరూపంలో మార్పిడి అయిందో కూడా తెలియదని పేర్కొంది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. వెయ్యి, 500 నోట్ల రద్దు నేపథ్యంలో రూ. 15.28 లక్షల కోట్ల రద్దైన నోట్లు తిరిగి బ్యాంకుకు వచ్చాయని, ప్రస్తుతం వీటి ధ్రువీకరణ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ లెక్కల్లో మార్పులు ఉండవచ్చునని ఆర్బీఐ వివరించింది. రానున్న కాలంలో రెగ్యులర్‌గా పెద్దనోట్ల రద్దు ప్రక్రియను కొనసాగించే అవకాశముందా? అని పార్లమెంటు స్థాయి సంఘం ప్రశ్నించగా.. సమాచారం లేదని ఆర్బీఐ బదులిచ్చింది.

దాదాపు రద్దైన నోట్లన్నీ తిరిగి కేంద్ర బ్యాంకుకు వివిధ రూపాల్లో రావడంతో పెద్దనోట్ల రద్దు విఫలమైందని, ఇది అర్థరహితమైన ప్రక్రియ అని మండిపడుతున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని అణచివేసేందుకు నవంబర్‌ 8, 2016న పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు వ్యవహారాన్ని పరిశీలిస్తున్న ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం.. వివరాలు కోరడంతో ఆర్బీఐ ఈమేరకు తెలిపింది.

Advertisement
Advertisement