సగం మందికి పైగా శంకర్ దాదాలే! | Sakshi
Sakshi News home page

సగం మందికి పైగా శంకర్ దాదాలే!

Published Tue, Jul 19 2016 10:08 AM

సగం మందికి పైగా శంకర్ దాదాలే! - Sakshi

మీకు ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ వద్దకు వెళ్లారా.. ఆయన మిమ్మల్ని జాగ్రత్తగానే చూశారని అనుకుంటున్నారా? ఎందుకైనా మంచిది.. ఓసారి ఆయన ఏం చదివారో తెలుసుకోండి. ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా డాక్టర్లకు అసలు మెడికల్ డిగ్రీలే లేవట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో తెలిపింది. దేశంలో అత్యవసరంగా వైద్యసంస్కరణలు చేపట్టాలని తెలిపింది. 2001 నాటికి దేశంలో 102 కోట్ల జనాభా ఉంటే వారికి కేవలం 20 లక్షల మంది మాత్రమే హెల్త్ వర్కర్లున్నారని, వీళ్లలో 39.6 శాతం మంది వైద్యులని, 30.5 శాతం మంది మిడ్వైఫ్లని, కేవలం 1.2 శాతం మంది మాత్రమే డెంటిస్టులు ఉన్నారని లెక్కలు వివరించింది. వైద్యులలో 77.2 శాతం మంది అలోపతి, 22.8 శాతం మంది హోమియో, ఆయుర్వేదం, యునానీ వైద్యులు.

అయితే.. ఇందులో అసలు విషయం ఏమిటంటే మొత్తం అలోపతి డాక్టర్లలో 57.3 శాతం మందికి అసలు మెడికల్ డిగ్రీలే లేవట. 31.4 శాతం మంది అయితే కేవలం సెకండరీ స్కూల్ విద్యతోనే చదువు ఆపేశారు. నర్సుల పరిస్థితి మరీ ఘోరం. 67.1 శాతం మంది అర్హత సెకండరీ స్కూల్ విద్య మాత్రమే. దేశంలోని 73 జిల్లాల్లో అసలు వైద్య పరమైన అర్హతలున్న నర్సులు ఒక్కరు కూడా లేరు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల అర్హతలు దారుణంగా ఉన్నాయి. అలోపతి వైద్యుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయి. పురుష వైద్యుల సంఖ్య బాగా ఎక్కువగానే ఉన్నా, వాళ్ల విద్యార్హతలు మాత్రం మహిళా వైద్యుల కంటే బాగా తక్కువట. అలోపతి వైద్యుల్లో పురుషుల్లో కేవలం 37.7 శాతం మంది మాత్రమే తగిన అర్హతలు ఉన్నవాళ్లయితే మహిళల్లో మాత్రం ఇది 67.2 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 593 జిల్లాలుండగా, 58 జిల్లాల్లో అసలు దంత వైద్యులే లేరట.

Advertisement
 
Advertisement
 
Advertisement