రాజధాని నగరంలో అంతర్జాతీయ వైద్య సదస్సు జరుగుతుండటంతో రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారబోతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: రాజధాని నగరంలో అంతర్జాతీయ వైద్య సదస్సు జరుగుతుండటంతో రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారబోతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం ఇక్కడి హోటల్ మారియెట్‌లో జరిగిన మొదటి వరల్డ్ అబ్‌స్టెట్రిక్ అనస్తీషియాలజిస్ట్స్ (మత్తు మందు ఇచ్చే వైద్యులు) కాంగ్రెస్ జరిగింది. ఈ సదస్సుకు 28 దేశాల నుంచి 1,200 మంది ప్రతి నిధులు హాజరయ్యారు. సదస్సులో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, వైద్య రంగానికి చెందిన ప్రపంచస్థాయి సదస్సు హైదరాబాద్‌లో జరగడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమన్నారు.
ఇలాంటి ప్రపంచ స్థాయి సదస్సులు, సమావేశాలతో హైదరాబాద్ మెడికల్ హబ్‌గా, మెడికకల్ టూరిజంగా మారుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్వైన్ ఫ్లూ వైరస్‌ను గుర్తించగానే చికిత్స అందిస్తున్నామని, అందుకు ఫీవర్ ఆసుపత్రిలో అన్నిరకాల సదుపాయాలు ఉన్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ రామ్ పాపారావు, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సునీల్ పాండ్యా, బ్రిటన్‌కు చెందిన ఓఏఏ అధ్యక్షుడు రోషన్ ఫెర్నాండో, ఆస్ట్రేలియాకు చెందిన ఓఏఎస్‌ఓ అధ్యక్షుడు స్టీఫెన్ గాల్ట్ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో అనస్తీషియాలజిస్ట్ వైద్యులకు సూచించే మార్గదర్శకాల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు.