యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ మానసపుత్రికగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చ జరగనుంది.
న్యూఢిల్లీ : యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ మానసపుత్రికగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లుపై గురువారం లోక్‌సభలో చర్చ జరగనుంది. ఈ సమావేశంలోనే ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయించుకోవాలన్న పట్టుదలతో యూపీఏ సర్కారు ఉంది. అయితే ఆహార భద్రత బిల్లుకు ప్రభుత్వం కొన్ని సవరణలు చేసే అవకాశముంది. విపక్షాలు లేవనె త్తిన ఆందోళనలను తొలగించేందుకు బిల్లులో కొన్ని సవరణలు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం పార్లమెంటులో బొగ్గు స్కాం, ఉల్లి ధరలు వంటి అంశాలపై రభసతో బిల్లుపై చర్చకు ఆటంకం కలగడం తెలిసిందే. గురువారం లోక్‌సభలో బిల్లుపై చర్చ జరుగుతుందని, దానికి సభ ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.
ఆహార భద్రత పథకానికి సంబంధించి విపక్షాలు 265 సవరణలు సూచించాయి. పథకాన్ని అందరికీ వర్తింపజేసి, తిండిగింజలతోపాటు పప్పు ధాన్యాలు, వంటనూనె, చక్కెరలను చేర్చి, మనిషికి నెలకు 5 కేజీలకు బదులు 7 కేజీల ధాన్యమివ్వాలన్నది వీటి సారాంశం. ఆహార సబ్సిడీని నగదు రూపంలో చెల్లించవద్దన్నది మరో కీలక సవరణ. కాగా దేశంలోని దాదాపు 80 కోట్ల మందికి ప్రతినెలా ఒక రూపాయి నుంచి మూడు రూపాయల వరకు కిలో చొప్పున 5 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వడమే లక్ష్యంగా రూపొందించిన ఈ పథకం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు తెచ్చిపెడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో బిల్లులు చర్చకు వచ్చే అవకాశమున్నా అందరి దృష్టి ఆహారభద్రత బిల్లుపైనే నెలకొంది.