‘సీఎం చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టింది.. అవసరానికి మించి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు’’
పది వామపక్ష పార్టీల ధ్వజం
సాక్షి, అమరావతి: ‘‘సీఎం చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టింది.. అవసరానికి మించి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు’’ అంటూ పది వామపక్ష పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. రైతులు, పేదల పొట్టకొట్టి కాలుష్యకారక పరిశ్రమలు పెడతామంటే కచ్చితంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశాయి.
పోలీసు ఆంక్షలు పెట్టినా లెక్క చేయబోమని, బాధిత గ్రామాల్లో పర్యటించి దశలవారీ ఆందోళనలు చేపడతామని, అనంతరం అసెంబ్లీని ముట్టడిస్తామని పేర్కొన్నాయి. విజయవాడ సీపీఎం కార్యాలయంలో శనివారం జరిగిన పది కమ్యూనిస్టుపార్టీల నేతల సమావేశం ఈమేరకు పలు తీర్మానాలు చేసింది. వివరాల్ని నేతలు మీడియాకు వెల్లడించారు.