
ఇది సామాన్యుడి జీతమా !?
‘మంచి రోజులు వస్తున్నాయి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారంలో ఎంత వాస్తవముందో తెలియదుగానీ ఢిల్లీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి రోజులు వస్తున్నాయంటూ సామాజిక వెబ్‌సైట్ ‘ట్విట్టర్’లో విమర్శల వర్షం కురుస్తోంది.
న్యూఢిల్లీ: ‘మంచి రోజులు వస్తున్నాయి’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారంలో ఎంత వాస్తవముందో తెలియదుగానీ ఢిల్లీ ఎమ్మెల్యేలకు మాత్రం మంచి రోజులు వస్తున్నాయంటూ సామాజిక వెబ్‌సైట్ ‘ట్విట్టర్’లో విమర్శల వర్షం కురుస్తోంది. ఢిల్లీ ఎమ్మెల్యేకు ప్రస్తుతమున్న వేతనాలు 88 వేల రూపాయలను (కరువు, ఇతర భత్యాలను కలుపుకొని) 2.10లక్షల రూపాయలకు పెంచాలంటూ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్య్ర పానెల్ సిఫార్సు చేసిన విషయం తెల్సిందే. ఏకంగా 400 శాతం పెంపును సిఫార్సు చేయడం ఏమిటని ట్విట్టర్ యూజర్లు ‘ట్వీట్లు తొక్కారు’.
వారి ట్వీట్లు ఇలా ఉన్నాయి.....‘మంచి రోజులు ఆప్ ఎమ్మెల్యేలకే ఉన్నాయి... ఆమ్ ఆద్మీ కాస్త ఖాస్ ఆద్మీగా మారిపోయింది....ఆమ్ ఆద్మీ బికమ్ ఏ అంబానీ ఆద్మీ! ఫుల్ యాష్ కర్‌లో భాయ్! ఫిర్ కబీ ఎమ్మెల్యే బనే కా మౌకా మిలే న మిలే.....మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలూ ఎలాగు లేవు. ఈ ఐదేళ్లలో ఎంత దోచుకుంటే అంత దోచుకోండి ఖజానాను....ఢిల్లీ ఎమ్మెల్యేలకు నాలుగు రెట్లు జీతం పెరుగుతోంది. ఢిల్లీలో నాలుగు రెట్లు డెంగ్యూ మృతులూ పెరిగారు...సిగరెట్లు, విదేశీ మద్యం విపరీతంగా పెరిగింది, ఎమ్మెల్యే జీతాలు పెరిగాయి....400 శాతం జీతం పెంపు, ఇది ఆమ్ ఆద్మీ జీతమా?...ఆమ్ ఆద్మీ పార్టీ పేరును వీవీఐపీగా మార్చుకోండి’ ఇలా విమర్శల వర్షం కురవగా, ‘వంద శాతమో, రెండు వందల శాతమో పెంచుకొని, మిగతా సొమ్మును త్యాగం చేశామని చెప్పండి....కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు జీతభత్యాలతోపాటు, బెదిరింపులతో దండుకునే సొమ్ము, కమీషనల్ల ద్వారా వచ్చే సొమ్ము అదనం కాగా, ఆమ్ ఆద్మీకి కేవలం జీతభత్యాలే వస్తాయి’ అంటూ కొన్ని సానుకూల స్పందనలు కూడా వచ్చాయి.
ఇంకా తాము స్వతంత్య్ర కమిటీ చేసిన వేతన సిఫార్సులను ఆమోదించలేదని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రకటనను ట్విట్టర్ యూజర్లు పట్టించకున్నట్టు లేదు. అంతేకాదు, ఇప్పటి వరకు ఢిల్లీ ఎమ్మెల్యేలకు ఉచితంగా ఇస్తున్న వసతి, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలకు చార్జీలు వసూలు చేయాలంటూ స్వతంత్య్ర కమిటీ చేసిన మరో ముఖ్యమైన సిఫార్పును కూడా పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 మంది శాసన సభ్యులు ఉండగా, బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు ఉన్న విషయం తెల్సిందే.