రెమిటెన్సుల్లో భారత్ టాప్ | India receives whopping $71 billion in remittances in 2013, tops global chart | Sakshi
Sakshi News home page

రెమిటెన్సుల్లో భారత్ టాప్

Oct 4 2013 5:44 AM | Updated on Sep 1 2017 11:18 PM

రెమిటెన్సుల్లో భారత్ టాప్

రెమిటెన్సుల్లో భారత్ టాప్

రెమిటెన్సులను అందుకోవడంలో ఈ ఏడాది భారత్ అగ్రస్థానంలో నిల్చింది. గతేడాది మొత్తం మీద వచ్చిన రెమిటెన్సుల కన్నా సుమారు మూడు రెట్లు అధికంగా

వాషింగ్టన్: రెమిటెన్సులను అందుకోవడంలో ఈ ఏడాది భారత్ అగ్రస్థానంలో నిల్చింది. గతేడాది మొత్తం మీద వచ్చిన రెమిటెన్సుల కన్నా సుమారు మూడు రెట్లు అధికంగా 2013లో ఏకంగా 71 బిలియన్ డాలర్లు అందుకుంటోంది. ప్రపంచ  బ్యాంకు రూపొందించిన అంచనాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రవాసీలు తమ స్వదేశాలకు పంపే నిధులను రెమిటెన్సులుగా వ్యవహరిస్తారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 71 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో, 60 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 26 బిలియన్ డాలర్ల రెమిటెన్సులతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉన్నాయి. 
 
 పలు దేశాలకు రెమిటెన్సులు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బసు పేర్కొన్నారు. తజికిస్తాన్ లాంటి దేశాల జీడీపీలో వీటికి దాదాపు సగభాగం వాటా ఉండగా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో పేదరిక సమస్య కట్టడికి రెమిటెన్సులు ఉపయోగపడగలవని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రపంచ స్థాయిలో రెమిటెన్సులు మొత్తం మీద 550 బిలియన్ డాలర్లుగా నమోదు కాగలవని, 2016 నాటికి ఈ పరిమాణం 707 బిలియన్ డాలర్లకు పెరగగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదే వర్ధమాన దేశాల్లోకి వచ్చే నిధులు 2016 నాటికి 550 బిలియన్ డాలర్ల మేర ఉండగలవని పేర్కొంది. 
 
 అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణ భయాల వల్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే తరుణంలో ఆర్థిక సమతౌల్యం సాధించేందుకు ఈ నిధులు తోడ్పడగలవని బసు వివరించారు. దేశీ కరెన్సీ పతనమైన తరుణంలో రెమిటెన్సులు మరింతగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వర్ధమాన దేశాలకు వచ్చే రెమిటెన్సుల్లో దాదాపు మూడో వంతు భాగం భారత్, చైనాలదే ఉండనుందని ప్రపంచ బ్యాంకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బసు పేర్కొన్నారు. వర్ధమాన దేశాలకు రెమిటెన్సులు మధ్యకాలికంగా మరింత పెరగగలవని, సగటున వార్షికంగా తొమ్మిది శాతం వృద్ధి నమోదు కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement