నేను హిందువునే కానీ..

నేను హిందువునే కానీ.. - Sakshi


- హానికారక హిందూత్వను సహించను

- బీజేపీపై బెంగాల్ సీఎం ఫైర్‌.. ఫేస్‌బుక్‌లో సంచలన పోస్ట్

- ఉద్రిక్తత నడుమ పూరిజగన్నాథుణ్ని దర్శించుకున్న మమత
పూరి: "జన్మతాః నేను హిందువును. అయితే హిందువులను అపఖ్యాతిపాలుచేసే బీజేపీ తరహా హిందూత్వను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సహించబోను" అని అన్నారు పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం ఆమె పూరి(ఒడిశా)లోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బెంగాలీలకు పూరిజగన్నాథుడంటే అమితమైన నమ్మకమని, ఏటా పూరికి వచ్చే భక్తుల్లో బెంగాలీలూ పెద్ద సంఖ్యలో ఉంటారని గుర్తుచేశారు. తన ఆలయప్రవేశంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలు రచ్చచేయడంపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పూరి ఆలయంలో పూజల అనంతరం సర్క్యూట్‌ హౌస్ లో విలేకరులతో మాట్లాడిన మమత.. 'బీజేపీ కార్యకర్తలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నాకు మాత్రం జగన్నాథుడిపట్ల విశ్వాసం ఉది' అని వ్యాఖ్యానించారు. హిందూ మతం చాలా గొప్పదని, అందరినీ కలుపుకునే తత్వం దానిలో ఉందని మమత అన్నారు. రామకృష్ణపరమహంస శిశ్యుడు స్వామివివేకానంద హిందూమతఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లారని గుర్తుచేశారు.గొడ్డుమాంసం తినమన్న మమతకు ఆలయప్రవేశమా?

పూరి ఆలయ దర్శనం కోసం మంగళవారం ఒడిశా వచ్చిన మమతకు వ్యతిరేకంగా బీజేపీ యువ మోర్ఛా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. గతంలో 'హిందువులు కూడా గొడ్డుమాంసం తినొచ్చు' అన్న మమత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిరసన చేపట్టింది. గోమాంస భక్షణను సమర్థించిన మమతను ఆలయంలో అడుగుపెట్టనియ్యబోమని పూరి సహా పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రంగంలోకిదిగిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్టులు చేశారు. రాష్ట్ర అతిథిగా విచ్చేసిన బెంగాల్‌ ముఖ్యమంత్రి కోసం ఒడిశా సర్కారు భారీ భద్రతా ఏర్పాట్లుచేసింది.ప్రాంతీయ పార్టీలు బలపడాలి..

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ అన్నారు. ఆయా పార్టీలు ప్రాంతీయంగా బలంగా ఉంటూనే జాతీయ స్థాయిలో కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. తద్వారా సమాఖ్య వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు.ఫేస్‌బుక్‌లో మమత సంచలన పోస్ట్

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top