కోడలి వేధింపులతో.. కుటుంబం ఆత్మహత్య

కోడలి వేధింపులతో.. కుటుంబం ఆత్మహత్య


కోడలు పెట్టిన వేధింపులు, ఆమె బెదిరింపులు తట్టుకోలేక నోయిడాకు చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రాంచీలోని ఒక ఫ్లాట్‌లో ఈనెల 9వ తేదీన ఐదుగురు కుటుంబ సభ్యుల మృతదేహాలు కనిపించాయి. వాళ్లంతా పెద్ద మొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారితో పాటు నోయిడాకు చెందిన డాక్టర్ సుకాంత సర్కార్ ఒంటిమీద తీవ్రమైన గాయాలతో కనిపించారని పోలీసులు చెప్పారు. కుటుంబం మొత్తం తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతోందని, వాళ్లు తొలుత నోయిడాలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, తర్వాత రాంచీ వరకు వచ్చి ఇక్కడ చనిపోయారని తెలిపారు. వాళ్లతో పాటు ఆ ఇంటి కోడలు మాత్రం రాలేదు. ఆత్మహత్య వద్దని తమవాళ్లకు చెప్పేందుకు తాను ఎంతగానో ప్రయత్నించినట్లు డాక్టర్ సర్కార్ చెప్పారు. కుటుంబంలో 63 ఏళ్ల సర్కార్, ఆయన భార్య అంజన (60), కుమారుడు సమీర్ (35), మనవరాలు సమీత (7), సమీర్ మరదలు మౌమిత (35), ఆమె కూతురు సుమిత (5) ఉన్నారు. వీళ్లలో మౌమిత.. సర్కార్ కోడలికి సొంత చెల్లెలు.



ఈనెల 8వతేదీ రాత్రి 10-11 గంటల మధ్య సమయంలో అంజన, సమీర్, మౌమిత భారీమొత్తంలో మత్తుమందు ఇంజెక్షన్ తీసుకున్నారు. తర్వాత అంజన, మౌమిత కలిసి పిల్లలిద్దరికీ కూడా అవే ఇంజెక్షన్లు ఇచ్చారు. కాసేపటి తర్వాత అందరూ స్పృహతప్పి పడిపోయారు. డాక్టర్ సర్కార్ ఒక కత్తి తీసుకుని తనను తాను తీవ్రంగా పొడచుకుని గాయపర్చుకున్నారు గానీ.. 'దురదృష్టవశాత్తు' తన ప్రాణాలు పోలేదని ఆయన అన్నారు. తన కోడలు తామందరి మీద వరకట్న వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించేదని, తన సోదరి మౌమితతో సమీర్, తాను కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఆరోపించేదని ఆయన వాపోయారు. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఆమెకు జత కలిసింది. భోపాల్‌లో ఉండే మౌమిత భర్త కూడా ఈ దుర్ఘటన జరిగినరోజు రాత్రి రాంచీ వచ్చినా.. అతడు వేరే బంధువుల ఇంటికి వెళ్లాడు. డాక్టర్ సర్కార్ ప్రాణాలకు ముప్పు పలేదని, రెండు మూడు రోజుల్లో ఆయనను ఈ కేసు విషయంలో ప్రశ్నిస్తామని పోలీసులు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top