ప్రత్యూష పరిస్థితిపై నివేదిక ఇవ్వండి | Give a report on the situation pratyusa | Sakshi
Sakshi News home page

ప్రత్యూష పరిస్థితిపై నివేదిక ఇవ్వండి

Jul 14 2015 12:51 AM | Updated on Aug 31 2018 8:24 PM

ప్రత్యూష పరిస్థితిపై నివేదిక ఇవ్వండి - Sakshi

ప్రత్యూష పరిస్థితిపై నివేదిక ఇవ్వండి

సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన 19 ఏళ్ల యువతి ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను తమ

హోంశాఖను ఆదేశించిన హైకోర్టు
ఈ  ఘటనపై చలించిపోయిన జస్టిస్ చల్లా కోదండరామ్
సుమోటో పిటిషన్‌గా తీసుకోవాలని తాత్కాలిక సీజేకు లేఖ
అంగీకరించి.. విచారించిన ధర్మాసనం

 
హైదరాబాద్ : సవతి తల్లి, కన్నతండ్రి చేతుల్లో తీవ్ర హింసకు గురైన 19 ఏళ్ల యువతి ప్రత్యూష ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం తెలంగాణ హోంశాఖ అధికారులను ఆదేశించింది. ప్రత్యూష ప్రస్తుతం ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. వైద్యులెవరు.. ఆమెను చూసేందుకు ఇప్పటి వరకు ఎవరైనా బంధువులు వచ్చారా.. వస్తే వారి వివరాలు.. ఆమె శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమిటి.. ద్రవాహారమే ఎందుకు అందిస్తున్నారు.. ప్రత్యూష ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు.. బాధ్యులుపై ఏం చర్యలు తీసుకున్నారు.. పరారీలో ఉన్న తండ్రిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు.. తదితర వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూ ర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించి ఆమెచేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక సీజే జస్టిస్ బొసాలేకు లేఖ రాశారు.

పత్రికల కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. ఈ లేఖను పరిశీలించిన జస్టిస్ బొసాలే  పత్రిక కథనాలను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి రిజిస్ట్రీకి ఆదేశాలిచ్చారు. ఆ మేరకు దాఖలైన పిటిషన్‌ను  జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఏ దశలోనూ దీనిని తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.  ప్రత్యూష ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలన్న ధర్మాసనం, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.
 
రక్షిత గృహాల విషయంలోనూ నిలదీత
 కాగా, రక్షిత గృహాల ఏర్పాటు విషయంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, ఈ విషయంలో చట్ట నిబంధనలను చదివి రావాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులకు హైకో ర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తుంటే, మీరు (ప్రభుత్వ న్యాయవాది) మాత్రం చాలా తేలిగ్గా తీసుకుం టున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. మనుషుల అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు, లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం రక్షిత గృహాలను ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛం ద సంస్థ ‘ప్రజ్వల’ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement