నోట్ల రద్దుపై కేంద్రానికి కఠినప్రశ్నలు! | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై కేంద్రానికి కఠినప్రశ్నలు!

Published Fri, Nov 18 2016 8:18 PM

నోట్ల రద్దుపై కేంద్రానికి కఠినప్రశ్నలు! - Sakshi

నోట్ల రద్దు విషయంపై కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టు, కోల్కత్తా హైకోర్టు నుంచి శుక్రవారం కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొంది. నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని..అల్లర్లు చెలరేగే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించిన వెంటనే... నోట్ల రద్దు విషయంపై వెంటనే కేంద్రం స్పందించాలని కోల్కత్తా హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 25లోపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి తమకు సమర్పించాలని కోరింది. బ్యాంకుల ఎదుట భారీ రద్దీ, క్యూలైన్లపై  సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించగా...  తమకు  కేంద్ర ప్రభుత్వ పాలసీలను మార్పు చేసే అవకాశం లేదని, కానీ ఈ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల అమలు సరిగా లేదని కోల్కత్తా హైకోర్టు అభిప్రాయపడింది.
 
అడ్వకేట్ రామప్రసాద్ సర్కార్ వేసిన పిల్ను విచారించిన కోల్కత్తా హైకోర్టు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ప్రభుత్వం ప్రజలను బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, పాత నోట్లను దానిలో డిపాజిట్ చేయమని  చెబుతోంది. కానీ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు మీకు తెలుసా? పన్ను పరిధిలోకి రాని ఆదాయాల వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణ ప్రజల కోసం కేంద్రం ఏం చేస్తుంది? అనే ప్రశ్నలను కేంద్రానికి సంధించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పాత కరెన్సీ నోట్లు అంగీకరించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, పెద్ద నోట్ల రద్దుతో అస్వస్తతతో బాధపడుతున్న ప్రజలను రక్షించడానికి ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  

Advertisement
Advertisement