సమైక్య ఉద్యమంపై చంద్రబాబు అనుమానం

సమైక్య ఉద్యమంపై చంద్రబాబు అనుమానం


సాక్షి, హైద రాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుమానమొచ్చింది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం నిజంగానే అంత తీవ్రస్థాయిలో ఉందా? లేదా తెరవెనుక ఎవరైనా నడిపిస్తున్నారా? ఉద్యమ ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై ఆరా తీయాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం ప్రారంభమైంది. అది రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో పత్రికలు, టీవీ చానళ్లు కూడా ఉద్యమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి.

 

 అయితే ఇది అసలైన ఉద్యమమేనా? లేక కేవలం మీడియా కావాలని అత్యధిక ప్రాధాన్యతనిస్తోందా? అని చంద్రబాబుకు అనుమానం వచ్చింది. దీంతో ఉద్యమం నిగ్గు తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలకు అప్పగించారని సమాచారం. ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి, పి.అశోక్ గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ , డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, కాగిత వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులు సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో ఉద్యమం తీవ్రత, దాని వెనుక ఎవరు  ఉన్నారు? మీడియా అధిక ప్రాధాన్యత ఇవ్వటానికి కారణాలు ఏమిటి? గ్రామస్థాయిలో కూడా ఉద్యమం జరుగుతోందా? అనే అంశాలపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి పార్టీ అధినేతకు నివేదిక అందిస్తామని జిల్లా పర్యటనల్లో ఉన్న నేత ఒకరు చెప్పారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top