
పండుగ షి'కారు'!
అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నా కార్ల కంపెనీలు భారత మార్కెట్‌పై ఆశలను బాగానే పెంచుకుంటున్నాయి.
అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నా కార్ల కంపెనీలు భారత మార్కెట్‌పై ఆశలను బాగానే పెంచుకుంటున్నాయి. అధికంగా ఉన్న వడ్డీరేట్లు, రోజురోజుకు పెరుగుతున్న ఇంధనం ధరలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇత్యాది కారణాల వల్ల కార్ల అమ్మకాలు కుదేలవుతున్నాయి. అయినప్పటికీ, దేశీయ, అంతర్జాతీయ వాహన కంపెనీలు మాత్రం అమ్మకాలు పెంచుకోవడానికి ప్రస్తుత మున్న మోడళ్లలో కొత్త వేరియంట్లనే కాకుండా, కొత్త కొత్త మోడళ్లను కూడా రంగంలోకి తెస్తున్నాయి.
గత నెలలో కార్ల అమ్మకాలు స్వల్పంగానైనా పుంజుకోవడంతో కార్ల కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయి. దీంతో పాటు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి గృహోపకరణాలు, వాహన కొనుగోళ్ల కోసం రుణాలివ్వడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు అదనపు నిధులివ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించడం కూడా కార్ల కంపెనీలకు కలసి వస్తోంది. దసరా, దీపావళి పండుగల సీజన్ నుంచి మొదలయ్యే ఈ కార్ల పండుగ వచ్చే ఏడాది వరకూ కొనసాగనున్నది. కొన్ని కంపెనీలు కొత్త కార్లను తెస్తుండగా, మరికొన్ని కంపెనీలు ప్రస్తుతమున్న మోడళ్లలోనే కొత్త వేరియంట్లను అందించనున్నాయి. మారుతీ సుజుకి నుంచి ఎక్స్‌ఏ ఆల్ఫా, హోండా బ్రియో మొబిలియో, డాట్సన్ గో ప్లస్‌లు కొత్త కార్లు. ఇక వేరియంట్ల విషయానికొస్తే, మారుతీ స్విఫ్ట్, నిస్సాన్ టెర్రానో, రేనాల్ట్ డస్టర్, డాట్సన్ గో, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ ఎలాంట్రా వంటివి ఉన్నాయి.
మారుతీ ఎస్‌యూవీ ఎక్స్‌ఏ ఆల్ఫా
స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్‌పై మారుతీ అందిస్తున్న ఎస్‌యూవీ ఇది. రేనాల్ట్ డస్టర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లకు పోటీగా మారుతీ తెస్తున్న ఈ ఎస్‌యూవీ ధర రూ. 6-8 లక్షల రేంజ్‌లో ఉండొచ్చు. వస్తాదుల కండరాలను గుర్తుకు తెచ్చేలా హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్‌ను డిజైన్ చేశారు. స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఉన్నట్లే ఈ కారు ఇంటీరియర్స్ కూడా ఉంటాయని సమాచారం.
మారుతీ కొత్త స్విఫ్ట్
ప్రస్తుతమున్న స్విఫ్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్త స్విఫ్ట్‌ను మారుతీ సుజుకి మార్కెట్లోకి తేనున్నది. పగటి పూట కూడా వెలుగులు విరజిమ్మే ఎల్‌ఈడీ లైట్లు ఈ కారు ప్రత్యేకత. ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, తదితర ప్రత్యేకతలున్నాయి. వచ్చే ఏడాది మార్కెట్లోకి రావచ్చు.
హోండా మొబిలియో: బ్రియో కారు ప్లాట్‌ఫామ్‌పై హోండా కారు తెస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ ఇది. బ్రియో ప్లాట్‌ఫామ్‌పై వస్తోన్న మూడో కారు ఇది. (రెండో కారు హోండా అమేజ్) పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానున్నది. మారుతీ సుజుకి ఎర్టిగాకు పోటీ ఇవ్వనున్న ఈ కారు ధర రూ.8-10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చు.
రేనాల్ట్ కొత్త డస్టర్
భారత్‌లో తమకు లైఫ్ ఇచ్చిన డస్టర్ మోడల్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి రేనాల్ట్ కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను అందిస్తోంది. డబుల్ ఆప్టిక్ హెడ్‌ల్యాంప్స్ ఆకర్షణ. సరికొత్తగా డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ టిప్‌డ్ ఎగ్జాస్ పైప్ వంటి ప్రత్యేకతలున్నాయి.
టయోటా కొత్త ఇన్నోవా: కారు ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన బంపర్ ప్రత్యేక ఆకర్షణ. వెనక భాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. అవే 2.0 లీటర్ పెట్రోల్, 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు. డీజిల్ వేరియంట్‌లో మాన్యువల్ గేర్ బాక్స్ ఉండగా, పెట్రోల్ వేరియంట్‌లో మాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్లు లభిస్తాయి. ఏబీఎస్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లున్నాయి.
హ్యుందాయ్ ఎలాంట్రా
ఎలాంట్రా మోడల్‌లో కొత్త వేరియంట్‌ను హ్యుందాయ్ అందించనున్నది. 1.6 డీజిల్ ఇంజిన్‌తో ఈ ఏడాది చివరకు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఈ కారును కంపెనీ మార్కెట్లోకి తెస్తోంది. 17 అంగుళాల అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణ.
నిస్సాన్ టెర్రానో : కోణాకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన బంపర్, సరికొత్త టెయిల్ ల్యాంప్, వెనక వైపు బంపర్‌లు ఇటీవలే విడుదలైన ఈ కారు ప్రత్యేకతలు.
డాట్సన్ ‘గో’ వస్తోంది
డాట్సన్ కంపెనీ భారత్‌లో అందించనున్న తొలి కారు ఇది. 5 సీట్ల, 5 డోర్ల ఈ హ్యాచ్‌బాక్‌ను వచ్చే ఏడాది భారత్‌లోకి తేనున్నది. 1.2 పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వంటి ప్రత్యేకతలున్నాయి. మారుతీ సుజుకి ఏ-స్టార్, హ్యుందాయ్ ఐ10లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాల అంచనా.
డాట్సన్ గో ప్లస్ ఎంపీవీ: డాట్సన్ నుంచి వస్తోన్న 7 సీట్ల ఎంపీవీ ఇది. ఇద్దరు కూర్చోడానికి వీలుగా మూడో వరుస ఉండడం, డాష్‌బోర్డ్‌లోనే గేర్‌షిఫ్ట్ లివర్‌ను అమర్చడం, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ కోసం మొబైల్ డాకింగ్ స్టేషన్ వంటి ఫీచర్లున్నాయి. ఇటీవలే ఇండోనేిసియాలో విడుదలైంది. వచ్చే ఏడాది భారత్‌లోకి రావచ్చు.
- సాక్షి, బిజినెస్ డెస్క్