కువైట్ కష్టం.. క్యాబ్‌డ్రైవర్ పాలు! | Cab driver cheated for two young mens | Sakshi
Sakshi News home page

కువైట్ కష్టం.. క్యాబ్‌డ్రైవర్ పాలు!

Sep 13 2015 2:25 AM | Updated on Aug 14 2018 3:14 PM

కువైట్ కష్టం.. క్యాబ్‌డ్రైవర్ పాలు! - Sakshi

కువైట్ కష్టం.. క్యాబ్‌డ్రైవర్ పాలు!

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం సాయంత్రం కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు కాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయారు.

శంషాబాద్/బాన్సువాడ: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం సాయంత్రం కువైట్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులు కాబ్ డ్రైవర్ చేతిలో మోసపోయారు. వారిద్దరినీ ఆ  డ్రైవర్ బురిడీ కొట్టించి రూ.10 లక్షల సొత్తుతో పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన ఖాలిద్, బోధన్‌కు చెందిన నసీర్ నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం విమానం ద్వారా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వీరు.. ఎంజీబీఎస్ వెళ్లేందుకు ఓ క్యాబ్‌లో ఎక్కి కూర్చున్నారు. వీరు రూ. లక్షల విలువచేసే స్మార్ట్‌ఫోన్లు, ఎల క్ట్రానిక్ సామాగ్రి, వెయ్యి దీనార్లు (రూ.2.19 లక్షల ఇండియన్ కరెన్సీ), 5 తులాల బంగారు నగలు తదితరాలతో కలిపి మొత్తం రూ. 10 లక్షల సొత్తు తీసుకువచ్చారు. వీటన్నీటినీ  డిక్కీలో భద్రపర్చి బయలుదేరారు.

క్యాబ్‌లో డీజిల్ లేదని, డీజిల్‌కు పైసలు ఇవ్వాలని డ్రైవర్ అడగడంతో అతడికి బ్యాగులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు. ఇదే క్రమంలో డ్రైవర్ ‘సార్.. మీ పాస్‌పోర్టు టాక్సీ స్టాండ్ వ ద్ద పడిపోయింది, చూడలేదా?’ అంటూ తికమకపెట్టాడు. నిజానికి వీరి పాస్‌పోర్టులు పోకున్నా, డ్రైవర్ మాటల్ని నమ్మి క్యాబ్‌ను వెనక్కి తీసుకెళ్లమన్నారు. డ్రైవర్ ట్యాక్సీ స్టాండ్‌కు తీసుకువచ్చి, ఇక్కడే పడి ఉంటుంది, చూడండని  అన్నాడు. క్యాబ్ నుంచి ఒకరే దిగగా, మీ స్నేహితుడికి సహాయం చేయరా? అంటూ మరో యువకుడిని ప్రశ్నించడంతో అతనూ దిగి వెతకడం ప్రారంభించాడు.

ఇదే అదనుగా భావిం చిన క్యాబ్ డ్రైవర్ సామాన్లతో కూడిన క్యాబ్‌ను తీసుకొని పరారయ్యాడు. దీంతో తాము  మోసపోయామని గ్రహించిన ఆ ఇద్దరు యువకులు శంషాబాద్ ఏయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆర్‌జీఐఏ క్రైమ్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement