కొత్త వాహనం కొంటున్నారా? | Buying a new vehicle? | Sakshi
Sakshi News home page

కొత్త వాహనం కొంటున్నారా?

Nov 30 2015 12:49 AM | Updated on May 24 2018 1:29 PM

కొత్త వాహనం కొంటున్నారా? - Sakshi

కొత్త వాహనం కొంటున్నారా?

కొత్త వాహనం తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఉత్కంఠ ఉంటుంది.

ధరలు... బీమా చూసుకోవాల్సిందే
 
కొత్త వాహనం తీసుకుంటున్నప్పుడు సహజంగానే ఉత్కంఠ ఉంటుంది. దీంతో ఎంత  బేరమాడి నా కొన్ని విషయాలపై అంతగా దృష్టి పెట్టలేం. దీనివల్ల ముందుగా లెక్కేసిన దానికన్నా ఎక్కువ కట్టి.. ఇంటికెళ్లాక తీరిగ్గా చింతించాల్సి వస్తుంది. ఇలా జరగకుండా కొత్త బండి తీసుకునేటప్పుడు దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అవి చూద్దాం...
 
ఎక్స్-ఫ్యాక్టరీ.. ఎక్స్‌షోరూం ధరలు..
 వాహనం తయారైనప్పుడు ఫ్యాక్టరీ వద్ద ఉండే విలువ .. షోరూంకి వచ్చేటప్పటికి మారిపోతుంది. షోరూం నుంచి మన చేతికి వచ్చేటప్పటికి ఇంకా మారిపోతుంది. ఇలా ఎక్స్-ఫ్యాక్టరీ, ఎక్స్ షోరూం ధరలతో పాటు పన్నులు, చార్జీలు మొదలైనవన్నీ కలిస్తే కొనుగోలుదారు కట్టేది తడిసిమోపెడవుతుంది. కొన్ని సందర్భాల్లో వాహన పరిమాణం, ఇంజిన్ సైజు, ఉపయోగించే ఇంధనం, రిజిస్ట్రేషన్ చేసే నగరం.. రాష్ట్రం తదితర అంశాలను బట్టి ఫ్యాక్టరీ రేటుతో పోలిస్తే 30-40 శాతం ఎక్కువగా కడుతుంటాం. ఒకోసారి కొనుగోలు ప్రక్రియ చాలా గందరగోళం వ్యవహారంగా అనిపించవచ్చు. లావాదేవీ మొత్తం పూర్తయి ఏదో రకంగా బండి చేతికొస్తే అదే పదివేలు అనిపించొచ్చు. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదు. ప్రతి చిన్న విషయంలోనూ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే చెక్కు ఇవ్వండి. వాహనం కొన్నప్పుడు... దేనికి ఎంత అయిందన్న పూర్తి వివరాలుండే ఇన్‌వాయిస్ కాపీని తీసుకోండి.

బీమా..: ప్రస్తుతం ఆన్‌లైన్లోనూ రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి కాకుండా వాహనాల తయారీ సంస్థలు స్వయంగా కూడా బీమా పాలసీలు అందిస్తున్నాయి. పాలసీ కొటేషన్ తీసుకుంటే చాలు!! ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్ వెల్లువలా వచ్చి పడుతుంటాయి. ఈ గందరగోళంలో పడి సిసలైన ఇన్సూరెన్స్ కవరేజీ వివరాలు చూసుకోవడం మర్చిపోవద్దు. పాలసీ తీసుకున్నప్పుడు కవర్ నోటు, రసీదు ఆన్‌లైన్‌లో వెంటనే లభిస్తాయి. పూర్తి వివరాలతో కూడిన సంపూర్ణమైన పాలసీ డాక్యుమెంటు వచ్చేదాకా వీటిని ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. సదరు కాపీ వచ్చిన తర్వాత ఏయే అంశాలకు కవరేజీ ఉంటుంది? వేటికి మినహాయింపు ఉంటుంది? వంటి అంశాలన్నీ సరిచూసుకోవాలి. వరదలు, అల్లర్లు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటి వల్ల వాహనానికి ఏదైనా జరిగితే కవరేజీ వర్తించేలా సమగ్రమైన పాలసీ ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా ఏయే సందర్భాల్లో కవరేజీ ఉంటుందో అడిగి తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని చిన్న, చిన్న విషయాలను సరిచూసుకుంటేనే... ఇష్టపడి తీసుకున్న వాహనంపై ఆనందంగా తిరగగలం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement