యూపీలో కమల సునామీ | BJP Win in Uttar Pradesh Elections | Sakshi
Sakshi News home page

యూపీలో కమల సునామీ

Mar 12 2017 1:25 AM | Updated on Mar 29 2019 5:33 PM

యూపీలో కమల సునామీ - Sakshi

యూపీలో కమల సునామీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 325 సీట్లను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది.

325 స్థానాల్లో బీజేపీ కూటమి ఘనవిజయం
అవధ్, బుందేల్‌ఖండ్‌లలో బీజేపీ ఏకపక్ష విజయం  


లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 325 సీట్లను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు మించిన సీట్లను సాధించింది. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద పరీక్షలో మోదీ సర్కారు విజయం సాధించింది.

సామాజిక వర్గాలు బలంగా పనిచేసే యూపీలో ఆర్నెల్లుగా సోషల్‌ ఇంజనీరింగ్‌ (ప్రాంతాలకు అనుగుణంగా సామాజిక వర్గాలను కలుపుకుని పోవటం)పై ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతోపాటు ‘సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌’ నినాదంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా నోట్లరద్దుతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రధాని యూపీలో ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. మొత్తం 40 శాతం ఓట్లతో బీజేపీ.. ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి (28%), బీఎస్పీ(22%)లను తోసిరాజని భారీ తేడాతో ముందు స్థానంలో నిలిచింది. 


ఎవరికెన్ని సీట్లు?
యూపీలో 14 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం చేపట్టనుంది. మూడొంతుల మెజారిటీ సాధించిన బీజేపీ జోరుకు ప్రత్యర్థులైన ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి, బీఎస్పీలు తుడిచిపెట్టుకుపోయాయి. బీజేపీ 312 స్థానాల్లో గెలవగా.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్‌ (ఎస్‌)9 స్థానాల్లో, ఎస్‌బీఎస్‌పీ 4 చోట్ల గెలిచాయి. మరోవైపు, ఎస్పీ 47 సీట్లు గెలవగా.. కాంగ్రెస్‌ మరీ దారుణంగా 7 సీట్లకే పరిమితమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. అప్నాదళ్‌ కన్నా కాంగ్రెస్‌ తక్కువ సీట్లు సాధించటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి జిల్లాల్లోని ఎనిమిది స్థానాలూ బీజేపీ వశమయ్యాయి.


బీజేపీ హవా!
ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికి అండగా ఉంటారనుకున్న యాదవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీ గాలి బలంగా వీచింది. యాదవ స్థానాల్లో చాలాచోట్ల బీజేపీ సత్తాచాటింది. దళితుల మద్దతు తమకే ఉంటుందన్న బీఎస్పీకి ఆ పార్టీ బలంగా ఉన్న సీట్లలో చుక్కెదురైంది. అఖిలేశ్‌ యాదవ్‌ కామ్‌ బోల్తాహై నినాదంతో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ.. అభివృద్ధి అంతా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. ఎస్పీ గ్రామాలను విస్మరించిందని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు శాంతిభద్రతల సమస్యలు ఎస్పీకి తలనొప్పిగా మారాయి. అటు తప్పనిసరిగా గెలవాల్సిన యూపీలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. రైతులకు రుణాలు మాఫీ చేస్తాననే హామీ, అభివృద్ధి మంత్రం బీజేపీకి కలిసొచ్చాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్‌ ఘోర పరాజయంతో సీఎం అఖిలేశ్‌ కుమార్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం రాజీనామా లేఖను గవర్నర్‌ రాంనాయక్‌కు అందజేశారు. దీన్ని ఆమోదించిన గవర్నర్‌.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని అఖిలేశ్‌ను కోరారు. ‘కొత్త ప్రభుత్వం ఎస్పీ సర్కారుకన్నా బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం’అని అఖిలేశ్‌ తెలిపారు.

ఏ ప్రాంతంలో ఎవరెవరు?
యూపీలోని అవధ్, పూర్వాంచల్‌ ప్రాంతాలు చారిత్రాత్మకంగా, రాజకీయంగా చాలా కీలకం. ఈ రెండు ప్రాంతాల్లో కలుపుకుని 243 సీట్లున్నాయి. ప్రభుత్వ మెజారిటీని నిర్ణయించే ఈ సీట్లలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. అవధ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగా.. పూర్వాంచల్‌లో బీఎస్పీ, ఎస్పీ తమ అస్తి త్వాన్ని చాటుకున్నాయి. వారణాసి చుట్టుపక్కలనున్న జిల్లాల్లో బీజే పీతో పోటీగా ఈ రెండు పార్టీలు సత్తాచాటాయి. అలీగఢ్, ఆగ్రా, మీరట్‌ వంటి కీలక నగరాలున్న పశ్చిమయూపీలో అక్కడక్కడ ఎస్పీ, బీఎస్పీ సీట్లు గెలుచుకున్నా బీజేపీ మెజారిటీ సాధించింది. మతపరంగా అతిసున్నిత ప్రాంతాలున్న పశ్చిమాంచల్‌లోని ముస్లిం మెజారిటీ స్థానాల్లోనూ కమలం పాగా వేసింది. బీఎస్పీకి బలమైన కోటగా పేరున్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతం చాలాకాలంగా కరువుతో తాండవమాడుతోంది. ఒకటి రెండుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచినా బుందేల్‌ఖండ్‌ పూర్తిగా కమలం వైపే మొగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement