
గోవును తిరిగిచ్చేసిన మాజీ మంత్రి
తనకు కానుకగా ఇచ్చిన గోవును సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తిరిగిచ్చేశారు.
రాంపూర్: గోవర్థన పీఠం శంకరాచార్య తనకు కానుకగా ఇచ్చిన గోవును సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్ తిరిగిచ్చేశారు. గోమాతకు ఎవరైనా హాని తలపెడితే తనకు చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేసినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు లేఖ రాశారు.
‘ముస్లింలు నేడు అభద్రతా వాతావరణంలో నివసిస్తున్నారు. నా దగ్గరున్న ఆవుకు గోపరిరక్షులు ఎవరైనా హాని తలపెట్టినా లేదా చంపినా నాకు, ముస్లిం కమ్యునిటీకి చెడ్డపేరు వస్తుంద’ని లేఖలో పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా దేశంలో దుష్ట ప్రచారం మొదలైందని వాపోయారు. ముస్లింల పరిస్థితి బానిసల కన్నా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన గోశాలలో పెంచుకుంటానని అడగంతో 2015లో ఆజంఖాన్ కు గోవును గోవర్థన పీఠం శంకరాచార్య బహుమతిగా ఇచ్చారు. తనకు ఇచ్చిన ఆవును చాలా జాగ్రత్తగా చూసుకున్నానని ఆజంఖాన్ తెలిపారు. భద్రతా కారణాల రీత్యా దాన్ని తిరిగిచ్చేస్తున్నానని చెప్పారు. మాంసం అమ్మకాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని విమర్శించారు. వీవీఐపీలకు మాంసం తినేందుకు అనుమతించిన బీజేపీ సర్కారు సామాన్యులపై అనవసరమైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు.