ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ! | Australia suffer heartbreak in champions trophy | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!

Jun 6 2017 9:07 AM | Updated on Sep 5 2017 12:57 PM

ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!

ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!

చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ.. ఆ జట్టు సెమీస్‌కు చేరాలంటే ఇక..

లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు అదృష్టం కలిసిరావడం లేదు. వరుణుడు మరోసారి కంగారులను దెబ్బతీశాడు. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు సునాయసంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. కుండపోతగా కురిసిన వర్షంతో ఈ మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో గెలిచే మ్యాచ్‌లోనూ చెరో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
ఇంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వరుణుడు విరుచుకుపడటంతో ఆ మ్యాచ్‌ కూడా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అప్పుడు కూడా ఒక పాయింట్‌తో ఆసీస్‌ సరిపెట్టుకుంది. ప్రస్తుతం రెండు మ్యాచ్‌లు ఆడి.. రెండుపాయింట్లతో ఉన్న కంగారులు.. సెమీఫైనల్‌లో అడుగుపెట్టాలంటే ఇంగ్లండ్‌తో జరగనున్న తమ చివరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు వర్షం బంగ్లాదేశ్‌కు కలిసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కనుక ఓడి ఉంటే ఆ జట్టు సెమీఫైనల్‌ రేసు నుంచి తప్పుకునేది. 
 
వర్షం మింగేసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 182 పరుగులకే కుప్పకూలింది. పేసర్‌ మిషెల్‌ స్టార్క్‌ (4/29) డెత్‌ ఓవర్లలో చేసిన మాయాజాలానికి ఆ జట్టు కుదేలైంది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (114 బంతుల్లో 95; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకునే ప్రయత్నం చేసినా సహచరుల నుంచి సహకారం లభించలేదు. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 44.3 ఓవర్లలో 182 పరుగులకు కుప్పకూలింది. షకీబ్‌ (48 బంతుల్లో 29; 2 ఫోర్లు), మిరాజ్‌ (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

జంపాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసిన అనంతరం వర్షం ఆటంకంతో మ్యాచ్‌ ఆగింది. క్రీజులో వార్నర్‌ (44 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు), స్మిత్‌ (25 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్‌) ఉన్నారు. మరో నాలుగు ఓవర్లు మ్యాచ్‌ కొనసాగి ఉంటే ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌ను వరించేది. కనీసం 20 ఓవర్లు ఆడితే.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం అప్పటికే దూకుడు మీద ఉన్న ఆస్ట్రేలియాకు విజయం లభించేది. కానీ వరుణుడు ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఎంపైర్లు ఇక మ్యాచ్‌ జరగడం వీలుకాదని తేల్చేసి..చేరో పాయింట్‌ పంచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement