పైన పంటలు.. లోన వంటలు | Amy’s Drive-Thru brings vegetarian fast food to Rohnert Park | Sakshi
Sakshi News home page

పైన పంటలు.. లోన వంటలు

Dec 19 2016 4:01 AM | Updated on Sep 4 2017 11:03 PM

పైన పంటలు.. లోన వంటలు

పైన పంటలు.. లోన వంటలు

ట్రాటెన్‌బర్గ్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ చేసిన ఈ హోటల్‌ పైకప్పుపై అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నారు.

ఫొటోలో ఉన్నదేంటో ’యామీస్‌’ అన్న పేరు చూడగానే తెలిసిపోయి ఉంటుంది. కానీ విషయం హోటల్‌కు మాత్రమే సంబంధించిన విషయంకాదు. శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)కు గంట ప్రయాణ దూరంలో ఉండే ఈ హోటల్‌ పైకప్పు చూశారా? అదీ సంగతి! ఈ డ్రైవ్‌ థ్రూ హోటల్‌లో శుద్ధ శాకాహార వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. పైగా వాటిల్లో అత్యధికం పైకప్పుపై పండినవే అయి ఉంటాయి. ఎక్కడెక్కడి పంటలన్నీ కొని తీసుకొచ్చి తింటే ఖర్చు ఎక్కువ కావడంతోపాటు జన్యుమార్పిడి పంటల కారణంగా లేనిపోని అనారోగ్యాలు వస్తాయేమో అన్న ఆలోచన యామీస్‌ కిచెన్‌ యాజమాన్యాన్ని ఈ ప్రయోగానికి పురికొల్పింది.

ట్రాటెన్‌బర్గ్‌ ఆర్కిటెక్ట్స్‌ డిజైన్‌ చేసిన ఈ హోటల్‌ పైకప్పుపై అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నారు. మొక్కలు పెంచేందుకు అవసరమైన మట్టి, దాని అడుగున అవసరానికి మించిన నీటిని తోడివేసేందుకు ఏర్పాట్లు, దాని దిగువన నీళ్లు కారకుండా ప్రత్యేకమైన కవచం.. ఇలా ఉన్నాయి. పక్కనే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ఓ ట్యాంక్, డ్రిప్‌ ఇరిగేషన్‌ మోటార్లను పనిచేయించేందుకు అవసరమైన సోలార్‌ ప్యానెల్స్, వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు బయోఛార్‌ (బొగ్గు) వంటివాటినీ ఏర్పాటు చేశారు.

వీటితోపాటు పర్యావరణానికి చేతనైనంత సాయం చేయాలన్న ఉద్దేశంతో యామీస్‌ కిచెన్‌ యాజమాన్యం ఇక్కడ 15 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్‌ ప్యానెల్స్‌ అదనంగా ఏర్పాటు చేసింది. వీటి అడుగునే కార్లను నిలిపి, ఆర్డర్‌ చేసిన ఆహారాన్ని పట్టుకెళ్లవచ్చు. ఈ ప్యానెల్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎలక్ట్రిక్‌ కార్లకు చార్జ్‌ చేసేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. మొత్తమ్మీద యామీస్‌ కిచెన్‌కు ఒక్కసారి వెళ్లామంటే... పెట్రోలు, డీజిల్‌లను విచ్చలవిడిగా మండిస్తూ వాతావరణ మార్పులకు కారణమవుతున్న వారు తమ కార్బన్‌ పాపాలను కొంచెమైనా కడిగేసుకోవచ్చన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement