
వైఎస్సార్ జనభేరి
ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించనున్నారు.
నేడు మరిపెడ, మానుకోట, నర్సంపేటలో షర్మిల రోడ్ షో
- వెఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం
- విజయవంతం చేయూలని పార్టీ
- జిల్లా అధ్యక్షుడు ముత్తినేని పిలుపు
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, డోర్నకల్ అసెంబ్లీ అభ్యర్థి సుజాతా మంగీలాల్‌కు మద్దతుగా ఆమె వైఎస్సార్ జన భేరి పేరిట ప్రచారం చేపట్టనున్నారు. మరిపెడ నుంచి మహబూబాబాద్ మీదుగా నర్సంపేట వరకు రోడ్‌షో సాగనుంది. ఉదయం పది గంటలకు మరిపెడలో రోడ్‌షో ప్రారంభం కానుంది.
అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం కురవి మీదుగా మహబూబాద్‌కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేరుకోనున్నారు. ఆ తర్వాత గూడూరు మీదుగా నర్సంపేటకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకుని.. అక్కడ రోడ్‌షోలో మాట్లాడనున్నారు. అనంతరం షర్మిల హైదరాబాద్‌కు వెళ్లిపోనున్నారు. షర్మిల రోడ్‌షో నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. రోడ్‌షోలను విజయవంతం చేసే ఏర్పాట్లలో ఇదివరకే నిమగ్నమయ్యారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల పరిధిలోని నాయకులు రోడ్‌షోలో భాగస్వామ్యం కానున్నారు.
షర్మిల రోడ్‌షోను జయప్రదం చేయాలి : ముత్తినేని
ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో షర్మిల చేపట్టిన రోడ్ షోను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా యువనేత జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్‌షోలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.