
21నుంచి పరామర్శ యాత్ర
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుం బాలను పరామర్శించేందుకు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుం బాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ జరగనుంది. ఈ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పాల్గొని ఆయా కుటుంబాలను పరామర్శించనున్నారు. వారం రోజులపాటు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో దేవరకొండ నియోజకవర్గంలోని మల్లేపల్లి వద్ద ప్రారంభం కానున్న ఈ యాత్ర నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట వరకు సాగుతుంది.
ఈ నియోజకవర్గాల్లోని మొత్తం 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని, మలి విడత యాత్ర వచ్చే నెలలో ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే: గట్టువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారంజిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కలిశారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వద్దకు స్వయంగా వస్తానని సంతాపసభ జరిగిన నల్లకాలువలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే ఈ యాత్రను నిర్వహిస్తున్నారన్నారు. జగన్ తరఫున ఆయన సోదరి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారని, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.