యువతరం కదిలింది

Young Voters Hikes In Greater Hyderabad - Sakshi

సిటీలో పెరిగిన యువ ఓటర్లు  

జీహెచ్‌ఎంసీ విస్తృత చైతన్యం  

ఎన్నికల ఏర్పాట్లపై యూపీ అధికారుల పరిశీలన

వివరాలు అందించిన దానకిశోర్‌

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో యువ ఓటర్లు అనూహ్యంగా పెరిగారు. అతి తక్కువగా ఉన్న యువ ఓటర్ల నమోదు కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతో తక్కువ సమయంలోనేవారి సంఖ్య 0.59 శాతం నుంచి 1.44 శాతానికి పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చిన ఉత్తర‡ప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి, జాయింట్‌ సీఈఓలకు ఇక్కడి ఎన్నికల ఏర్పాట్లను దానకిషోర్‌ వివరించారు. ఓటర్లలో 18–19 ఏళ్ల వయసు గలవారు 3.74 శాతం ఉండాల్సి ఉండగా ఇంకా 2.30 శాతం తక్కువగా ఉన్నారన్నారు. దీనికి కారణం యువ ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో నిరాశతతో ఉండడమేనని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా నగరంలోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థల్లో తాము చేసిన ఓటరు నమోదు చైతన్య కార్యక్రమాలతో 0.59 శాతం ఉన్న యువ ఓటర్ల సంఖ్య 1.44 శాతానికి పెరిగిందని వివరించారు. 

ఓటరు జాబితా ప్రక్షాళన..
హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఎన్నికల జాబితాను వడపోయడం సవాలే అయినా రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలతో పాటు బీఎల్‌ఓలతో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దానకిషోర్‌ తెలిపారు. జాబితాలో అక్షర దోషాలు, ఇంటి నంబర్లను తప్పుగా పేర్కొనడం, ఫొటోల మార్పిడి, ఒకే ఇంటి నంబర్‌పై అనేక మంది ఓటర్లు ఉండడం వంటి సమస్యలను సరిచేశామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో లేదా కంపౌండ్‌లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం తద్వారా ఒకే ఇంటి నంబర్‌పై 40 నుంచి 50 మంది ఓటర్లు ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. ఈసారి ఎన్నికల్లో మొదటిసారి కొత్తగా ప్రవేశపెట్టిన ‘వీవీప్యాట్‌’లపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించామన్నారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల చెకింగ్, తొలి విడత ర్యాండమైజేషన్‌ పూర్తి చేయడంతో పాటు ఈవీఎంలను సంబందిత నియోజకవర్గాల డీఆర్‌సీ కేంద్రాలకు కూడా పంపించామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన కమిటీలను సైతం నియమించామన్నారు. 

రూ.18.80 కోట్ల స్వాధీనం
ఎన్నికల వేళ జిల్లాలో రూ.18.80 కోట్ల నగదు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని దానకిషోర్‌ తెలిపారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిల్లాలో 1290 పోలింగ్‌ కేంద్రాలను క్రిటికల్‌ గుర్తించి విస్తత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందన్నారు. ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలు కూడా త్వరలో నగరానికి చేరుకుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ డి.ఎస్‌.చౌహాన్, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్లు హరిచందన, కెనడి, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top