అతివలే నిర్ణేతలు

Women Will Decide Who Will Win - Sakshi

హుస్నాబాద్‌లో వారిదే ఆధిక్యం 

విజేతను నిర్ణయించేది ‘స్వశక్తి’ మహిళలే..

ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీల నేతలు

అక్కడ పార్టీల గెలుపు, ఓటములను నిర్ణయించేది అతివలే. వారి చేతుల్లోనే అభ్యర్థులు భవితవ్యం ఆధారపడి ఉంది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లదే ఆధిక్యం. నియోజకవర్గంలో మొత్తం 2,18,361 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,08,827, మహిళలు 1,09,525 మంది ఉన్నారు.  ‘స్వశక్తి’ మహిళలే 70వేల మందివరకు ఉండడం విశేషం. అందుకే ఇప్పుడక్కడ అన్ని పార్టీల దృష్టి వారిపైనే. తమవైపు తిప్పుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరి శైలిలో వారు ప్రచారం సాగిస్తున్నారు.

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ నియోజకవర్గం మెట్ట ప్రాంతం కావడంతో ఎప్పుడు కరువు కాటకాలతో రైతు కూలీలు కరువు కష్టాలను ఎదుర్కొని పుట్టిన ఊరులో పనులు లేక పొట్ట కూటి కోసం వలస వెళ్లేవారు. కరువు ప్రాంతంలో దొరలు, భూస్వాముల వ్యవస్థలతో అణగారిన పేద ప్రజలు పేదిరకంలో కూరుకుపోయారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక ఉద్యమాలకు జీవం పోసిన నేల, 13 మంది అమర వీరులను ఒడిలో చేర్చుకున్న మహ్మదాపూర్‌ వీర భూమి, సర్వాయి పాపన్న ఉద్యమానికి స్థావరమైన కోటగిరి గట్లకు పురుడుపోసిన ఉద్యమాల ఖిల్లా,  పీపుల్స్‌వార్‌ (నక్సలైట్‌) ఉద్యమాలకు ప్రాణం పోసి పోరు బిడ్డలను అందించిన పోరు గడ్డ కరువు నేల.

పోరాట పటిమతోనే మెట్ట ప్రాంతం రైతాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఊపిరి పోసింది. హుస్నాబాద్‌ కరువు నేల నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికీ నిలబడి పోరు చేసే శక్తి అందించిన వీర వనితలకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులను ఎన్నుకొనే అవకాశం వచ్చింది. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 2,18,361 ఓటర్లకు పురుషులు 1,08,827, మహిళలు 1,09,525 ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా అందులో స్వశక్తి మహిళలు 70వేల మంది ఉండటం విశేషం. 

ఇందుర్తిలో ప్రతిపక్షం.. హుస్నాబాద్‌లో అధికార పక్షం..
హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 14సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు మినహా ఎప్పుడు ప్రతిపక్ష అభ్యర్థులే గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు గెలుపొందడం వల్ల హుస్నాబాద్‌ ప్రాంతము అభివృద్ధిలో వెనుకబడి పోయింది. హుస్నాబాద్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అధికార పార్టీ అభ్యుర్థులు గెలుపొందడం వారు అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. 1952లో నుస్తులాపూర్‌ నియోజకవర్గంలో పీడీఎఫ్‌ అభ్యర్థి సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 1957లో ఇందుర్తిగా మారిన తర్వాత చామన్‌పల్లి చొక్కారావు పీడీఎఫ్‌ గెలుపొంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉంది.

1962, 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి బీ.లక్ష్మీకాంతారావు గెలుపొందగా అప్పుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 1972లో బద్దం ఎల్లారెడ్డి సీపీఐ నుంచి విజయం సాధించగా అధికారంలో కాంగ్రెస్‌ ఉంది. 1979లో సీపీఐ దేశిని మల్లయ్య విజయం సాధించారు. 1983లో బీ.లక్ష్మీకాంతారావు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపొందగా అప్పుడు అధికారంలో టీడీపీ ఉంది. 1985, 1989, 1994లో సీపీఐ నుంచి చినమల్లయ్య  హాట్రిక్‌ సాధించిన అధికారంలో కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయి.

1999లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బొమ్మ వెంకటేశ్వర్లు గెలుపొందిన టీడీపీ అధికారంలో ఉంది. 2004లో సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి విజయం సాధించిన అధికారంలో కాంగ్రెస్‌ ఉంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో హుస్నాబాద్, చిగురుమామిడి, కోహెడ, సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి ఆరు మండలాలతో హుస్నాబాద్‌ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి నుంచి అధికార పార్టీ అభ్యర్థులు గెలువడం ఆనవాయితీగా వస్తుంది.

ఈసారి అవకాశం ఎవరికి
నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండు సార్లు రాజకీయలకు కొత్తగా వచ్చిన అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వొడితల సతీష్‌కుమార్‌లకు అవకాశం ఇచ్చిన ఓటర్లు.. రెండోసారి వీరితో పాటుగా చాడా వెంకటరెడ్డి పోటీలో ఉండటంతో వీరందరిలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాలి. అలాగే అన్ని పార్టిలు సంఘాలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

కొత్తవారిని ఆశీర్వదించిన స్వశక్తి మహిళలు..
నియోజకవర్గాల పునర్విభజనలో హుస్నాబాద్‌గా ఏర్పడిన నియోజకవర్గంలో రాజకీయ ప్రవేశం చేసిన కొత్తవారికి ఇక్కడి ఓటర్లు అవకాశం ఇస్తున్నారు. హుస్నాబాద్‌లో గెలిచిన పార్టీనే అధికారంలోకి రావడంతో హుస్నాబాద్‌ నుంచే కేసీఆర్‌ ఎన్నికల సభను ప్రారంభించడం నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. 2009 తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టికెట్‌ తెచ్చుకోని టీఆర్‌ఎస్‌పై విజయం సాధించగాఅధికారంలోకి కాంగ్రెస్‌ వచ్చింది.

2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీష్‌కుమార్‌ తొలిసారి పోటీ చేసి గెలుపొందగా అధికారంలోకి టీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చింది. హుస్నాబాద్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కొత్త నాయకులను  విజేతలుగా నిలుపుటకు స్వశక్తి సంఘాల మహిళల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. స్వశక్తి సంఘాల సభ్యుల ఓట్లను పొందినవారే విజేతలుగా నిలవడంతో ఇప్పుడు కూడా స్వశక్తి మహిళల 70వేల ఓట్లు గెలుపును నిర్ణయించనున్నాయి.

దీంతో నాయకులు సైతం మహిళా సంఘాల ఓట్లను రాబట్టుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ ఇచ్చే మేనిఫెస్టోల అంశాల ఆకర్షణతో పాటు నాయకుడి గుణగణాలను మహిళా సంఘాల సభ్యులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top