పట్టుబట్టి పంతం నెగ్గించుకున్న యువతి

Women Made Strike At Boy Friend House For Marriage In Munugode - Sakshi

సాక్షి, మునుగోడు : పట్టుపట్టి ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన ఓ యువతి చివరకు తన పంతం నెగ్గించుకుంది. ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని ప్రియుడి ఇంటి ఎదుట మూడు రోజుల పాటు చేపట్టిన దీక్ష సుఖాంతంగా ముగిసింది. తొలుత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆయువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ప్రియురాలి అఘాయిత్యంతో ఆ ప్రియుడు దిగొచ్చి వివాహానికి ఒప్పుకున్నాడు. వివరాలు.. మండలంలోని కల్వలపల్లి గ్రామానికి చెందిన కన్నెబోయిన లింగస్వామి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే పెళ్లి చేసుకుంటాను, పెద్ద సమక్షంలో మాట్లాడుకుందామని యువతి బంధువులను గత గురువారం యువకుడి ఇంటికి పిలిపించారు. తీరా వచ్చే సరికి యువకుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. దీంతో ఆ యువతి తనని పెళ్లి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటానని రెండు రోజుల పాటు అతడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది.

ఆత్మహత్యకు యత్నించి..
రెండు రోజుల పాటు తన ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేసినా వివాహం చేసుకునేందుకు ప్రియుడు అంగీకరించలేదు. పోలీసులు అతడికి కౌన్సిలింగ్‌ ఇచ్చినా అతడి నిర్ణయంలో మార్పు లేదనే విషయం తెలుసుకున్న ప్రియురాలు దీక్షాస్థలిలోనే నెయిల్‌ పాలిష్‌ (గోర్ల పెయింట్‌), కొన్ని మాత్రలు మింగింది. గమనించి కుటుంబ సభ్యులు ఆమెను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు యు వతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిసింది. 

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన
తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి కల్పించిన కన్నెబోయిన లింగస్వామి, అతడి కుటుంబ సభ్యులపై చర్య తీసుకోవాలని కోరుతూ యువతి తల్లిదండ్రులతో పాటు బంధువులు శనివారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో వారు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని పోలీసులు సముదాయించారు.

పెళ్లికి ఒప్పుకున్న ప్రియుడు
ప్రేమించిన యువతి ఆత్మహత్యానికి పాల్పడిన విషయం తెలుసుకున్న లింగస్వామి పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో రెండు కుటుంబాల వారు పెళ్లికి సమ్మతించడంతో మూడు రోజుల పాటు కల్వలపల్లిలో జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. అయితే సదరు యువతి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుండడంతో పట్టుపట్టి చివరకు పంతం నెగ్గించుకుందని గ్రామస్తులు పేర్కొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top