నేటి నుంచి వైన్‌షాపులు రాత్రి 8:30 వరకు

Wines Will Open Till 8.30pm In Telangana Says Srinivas Goud - Sakshi

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మద్యం దుకాణాలు రాత్రి 8:30 గంటల వరకూ తెరిచి ఉంటాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. హరితహారంలో భాగంగా ఈ ఏడాది 45 లక్షల తాటి, ఈత మొక్కలను నాటేందుకు తగినంత ప్రణాళిక సిద్ధం చేయాలని, గుడుంబా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎక్సైజ్‌శాఖపై శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి గీత కార్మికునికీ శాఖాపరమైన సభ్యత్వ కార్డులను అందజేయాలని, సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితిని కూడా పదేళ్ల పాటు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు.

అదనంగా తాటి, ఈత చెట్లను అదనపు రేషన్‌ కావాలంటే శాఖా పరంగా సంబంధిత అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవాలన్నారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ పనితీరును మరింత సమర్థవంతంగా ఉండేలా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను పటిష్టపరిచేందుకు ఒక సమర్థవంతమైన అధికారిని నియమిస్తామన్నారు. ఆబ్కారీ శాఖలో మహిళా ఉద్యోగులకు ఎలాంటి వేధింపులు జరిగినా కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. నీరా అమ్మకాలను ప్లాస్టిక్‌ సీసాలలో కాకుండా టెట్రా ప్యాక్‌లలో మాత్రమే జరపాలని మంత్రి కోరారు. ఈ సమీక్షలో ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, డిప్యూటీ కమిషనర్‌లు ఖురేషీ, కేఏబీ శాస్త్రి, సహాయ కమిషనర్‌ హరికిషన్, ఈఎస్‌లు దత్తరాజుగౌడ్, చంద్రయ్య, ప్రదీప్‌ రావు, గణేశ్‌ గౌడ్, రఘురాం, జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top