ఆత్మగౌరవం ఆరుబయటికే..

ఆత్మగౌరవం ఆరుబయటికే.. - Sakshi


► గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు  కలిగిన రాష్ట్రాల్లో మనది 28వ స్థానం

►దక్షిణ భారత దేశంలో తెలంగాణ తరువాతే ఇతర రాష్ట్రాలు

► ఏపీ 25వ స్థానంతో మనకన్నా కొంత నయం

►అత్యంత దయనీయ స్థితిలో జోగులాంబ గద్వాల జిల్లా


సాక్షి, మంచిర్యాల: స్వచ్ఛభారత్‌ సంకల్పం తెలంగాణలో చిన్నబోయింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల ఆత్మగౌరవం ఇప్పటికీ ‘ఆరుబయటికే’వెళ్తోంది. పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు ఉన్న ఒకటి రెండు జిల్లాలు, కొన్ని పంచాయతీలను చూపిస్తూ.. దానినే స్వచ్ఛభారత్‌–స్వచ్ఛ తెలంగాణగా చెప్పుకుంటున్నా.. జాతీయ స్థాయిలో అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్రామాల్లో మరుగుదొడ్లు వినియోగించే రాష్ట్రాల్లో తెలంగాణ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. అత్యంత దయనీయ పరిస్థితి ఏంటంటే దేశంలోని అన్ని జిల్లాల్లో అతి తక్కువ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్న జిల్లాగా జోగులాంబ గద్వాల ఉంది. ఇక చివరి నుంచి 20 స్థానాల్లో 9 జిల్లాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జోగులాంబ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు పారిశుధ్యరహిత జిల్లాలుగా వరుసగా 1, 3, 4 స్థానాల్లో నిలవడం రాష్ట్ర దయనీయ స్థితికి అద్దం పడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్‌ మినహా మిగతా 30 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 55 శాతానికి పైగా గృహాల్లో మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు ఉన్న గ్రామీణ భారతంలో మన స్థానం 28గా ఉంది. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 31 రాష్ట్రాల్లో గ్రామీణ తెలంగాణ 44.79 శాతం మరుగుదొడ్లు మాత్రమే ఉండి ఈ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కొంత నయంగా 25వ స్థానంలో ఉంది.



పారిశుధ్య రహిత రాష్ట్రాల్లో తెలంగాణకే మొదటి స్థానం

స్వచ్ఛభారత్‌ గణాంకాల ప్రకారం దేశంలోనే 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగిన రాష్ట్రాలుగా కేరళ, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌ నిలిచాయి. ఆ తరువాత స్థానాల్లో ఉత్తరాఖండ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు చేరాయి. గ్రామాల్లో అత్యంత దయనీయ స్థితిలో మరుగుదొడ్లు ఉన్న రాష్ట్రంగా 31వ స్థానంలో బీహార్‌ ఉంది. ఇక్కడ కేవలం 26.19 శాతం గ్రామీణ నివాసాల్లో మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. తరువాత జమ్మూకశ్మీర్‌ ఒడిశా, తెలంగాణ ఉన్నాయి ఏపీలోని గ్రామాల్లో 50.32 శాతం మరుగుదొడ్లు ఉన్నట్లు చెబుతున్న స్వచ్ఛభారత్‌ మిషన్  దాని స్థానాన్ని 25కి పదిలం చేసింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ తరువాత 23వ స్థానంలో పుదుచ్చేరి (51.54 శాతం), 21 స్థానంలో కర్ణాటక (62.2 శాతం), 19వ స్థానంలో తమిళనాడు (66.41 శాతం) నిలిచాయి. దక్షిణాది లెక్కల్లో కూడా పారిశుధ్య రహిత రాష్ట్రాల్లో తెలంగాణకే తొలిస్థానం దక్కడం గమనార్హం.



కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో 100

రాష్ట్రంలో 2012కు ముందు గ్రామాల్లో మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది. అప్పట్లో 30.8 శాతం ఉన్న మరుగుదొడ్లు ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి ‘స్వచ్ఛభారత్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తరువాత కొంత మెరుగైంది. 30 శాతం నుంచి 44.74 శాతానికి గ్రామీణ తెలంగాణలోని మరుగు దొడ్లు పెరిగాయి. రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా దేశంలోనే అతితక్కువ మరుగు దొడ్లు (6.74 శాతం)గా రికార్డు సృష్టించింది. తరువాత స్థానాల్లో కూడా పాలమూరు ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నిలవడం విశేషం. 17 జిల్లాల్లోని గ్రామాల్లో 50 శాతం కన్నా తక్కువ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండడంతో బహిర్భూములే దిక్కవుతున్నాయి.



ఓడీఎఫ్‌ పంచాయతీలు 1387

బహిర్భూమి రహిత (ఓపెన్  డెఫికేషన్  ఫ్రీ) పంచాయతీలుగా శనివారం నాటికి దేశంలో 1,41,662 నమోదైతే అందులో రాష్ట్రం వాటా కేవలం 1,387. ఇందులో జోగులాంబ, మహబూబాబాద్‌ జిల్లాలలో ఒకే గ్రామ పంచాయతీ చొప్పున ఉండగా, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లలో మూడేసి ఉన్నాయి. మేడ్చల్‌ (4), మహబూబ్‌నగర్‌ (6), నాగర్‌కర్నూల్‌ (7), వనపర్తి (8) చొప్పున ఓడీఎఫ్‌ గ్రామ పంచాయతీలను స్వచ్ఛంగా ప్రకటించుకున్నారు. కానీ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 211 గ్రామ పంచాయతీలకు 210, కరీంనగర్‌లో 261కి 204 పంచాయతీలు ఓడీఎఫ్‌ ఖాతాలోకి వెళ్లాయి. సిద్దిపేట, మెదక్, పెద్దపల్లిలో కూడా 50 నుంచి 70 శాతం వరకు ఓడీఎఫ్‌ పంచాయతీలున్నాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో 12,924 జీపీలకు గాను 2,041 ఓడీఎఫ్‌గా ప్రకటించారు.



మరుగుదొడ్లు అతి తక్కువ ఉన్న ఐదు జిల్లాలు

    జిల్లా                                        శాతం

    జోగులాంబ గద్వాల                     6.74

    మహబూబ్‌నగర్‌                       13.06

    నాగర్‌కర్నూలు                         14.25

    వనపర్తి                                   16.1



రాష్ట్రంలో ఎక్కువ మరుగుదొడ్లు ఉన్న ఐదు జిల్లాలు

    కరీంనగర్‌                                100

    సిరిసిల్ల రాజన్న                       100

    మేడ్చల్‌                                 74.5

    నిజామాబాద్‌                        73.47

    సిద్దిపేట                               73.35

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top