వాటర్‌ అలర్ట్‌!

Water Alert For Hyderabad People - Sakshi

కృష్ణాజలాల అత్యవసర పంపింగ్‌కు నిర్ణయం

ఈ నెల 7న ట్రయల్‌రన్‌..

10 నుంచి పూర్తిస్థాయిలో పంపింగ్‌

నగర తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: నాగార్జునసాగర్‌ జలాశయంలో నీరు అడుగంటుతోంది. దీంతో నగరానికి కృష్ణాజలాల సరఫరా ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జలమండలి ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది.నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ (పుట్టంగండి) వద్ద జలమండలి ఏర్పాటుచేసిన అత్యవసర పంపుల ద్వారా పంపింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ నెల 7 నుంచి ఎమర్జెన్సీ పంపింగ్‌ ప్రారంభం కానుంది. నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌(పుట్టంగండి)వద్ద జలమండలి ఏర్పాటుచేసిన అత్యవసర పంపులకు శుక్రవారం ట్రయల్‌రన్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 10 (సోమవారం)నుంచి పూర్తిస్థాయిలో అత్యవసర పంపింగ్‌ ప్రారంభించనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. పుట్టంగండి వద్ద ఏర్పాటుచేసిన అత్యవసర పంపింగ్‌ మోటార్లను బుధవారం జలమండలి సాంకేతిక విభాగం డైరెక్టర్‌ వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ పంపులకు 33 కెవి ట్రాన్స్‌మిషన్‌ లైను నుంచి విద్యుత్‌ సరఫరా జరగనుంది.

అత్యవసర పంపింగ్‌ ద్వారా నిత్యం కృష్ణా మూడు దశలకు అవసరమైన 270 మిలియన్‌ గ్యాలన్ల జలాలను నగరానికి తరలించనున్నారు. ఇందుకోసం 600 హెచ్‌పీ సామర్థ్యంగలవి 5, మరో ఐదు 300 హెచ్‌పీ సామర్థ్యంగల మోటార్లను ఏర్పాటు చేశారు. కాగా నాగార్జున సాగర్‌ గరిష్టమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం 508.7 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. నీటిమట్టాలు 507 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నందున అత్యవసర పంపింగ్‌ ఏర్పాట్ల ద్వారా నగరానికి తరలించనున్న కృష్ణాజలాలకు గండిపడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా గ్రేటర్‌నగరానికి ప్రస్తుతం గోదావరి మొదటిదశ,కృష్ణా మూడుదశలతోపాటు జంటజలాశయాలు హిమాయత్‌సాగర్,ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 465 మిలియన్‌గ్యాలన్ల నీటిని సేకరించి..శుద్ధిచేసి నగరంలోని 9.80 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌లో భూగర్భజలమట్టాలు గణనీయంగా పడిపోవడంతో జలమండలి నల్లా,ట్యాంకర్‌ నీళ్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. దీంతో అదనపు ట్యాంకర్ల ద్వారా జలమండలి వినియోగదారులకు తాగునీటిని అందిస్తోంది. ఇటీవల వీస్తున్న ఈదురుగాలులకు తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో నగరానికి తరలిస్తున్న నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. సాంకేతిక సమస్యలను అధిగమించి నగరంలో పానీపరేషాన్‌ తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి(గోదావరి),జంటజలాశయాల్లో నీటినిల్వలు సంతృప్తస్థాయిలోనే ఉన్నాయని..నగర తాగునీటి సరఫరాకు ఢోకాలేదని స్పష్టంచేశారు. త్వరలో రుతుపవనాలు కరుణిస్తే ఆయా జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన ఆశాబావం వ్యక్తంచేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top