ఎవరికో చాన్స్‌.. | Warangal TRS Leaders Will Get Minister Post | Sakshi
Sakshi News home page

ఎవరికో చాన్స్‌..

Dec 15 2018 12:35 PM | Updated on Dec 15 2018 12:35 PM

Warangal TRS Leaders Will Get Minister Post - Sakshi

డీఎస్‌.రెడ్యానాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వినయ్‌భాస్కర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  ఈ సారి రాష్ట్ర మంత్రి వర్గంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రాధాన్యం దక్కనుందా..  గెలిచిన ఎమ్మెల్యేల్లో సీనియర్లు ఉన్నారు.. వీళ్లలో ఎవరెవరికి బెర్తులు దొరుకుతాయి..? ఇలా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్‌ ఎమ్మెల్యేలు ఎవరికి వారు మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. మనుసులో మాటను వివిధ మార్గాల ద్వారా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కేసీఆర్‌ మాత్రం రాష్ట్ర అభివృద్ధి, సామాజిక వర్గాల లెక్కలు, భౌగోళిక అంశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలు స్తోంది. పాలకుర్తి ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు.. డోర్నకల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు ‘గులాబీ’ దళపతి మంత్రి వర్గంలో బెర్తు ఖరారు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సామాజిక వర్గాల లెక్కలతోపాటు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆశీస్సులు బలంగా ఉండడంతో ఎర్రబెల్లికి.. టీఆర్‌ఎస్‌ పార్టీ బలహీనంగా ఉన్న మహబూబాబాద్‌ ఎంపీ నియోజకవర్గాన్ని పార్లమెంట్‌ ఎన్నికల నాటికి గాడిలో పెట్టడంలో భాగంగా రెడ్యానాయక్‌కు కేసీఆర్‌ మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

తీవ్ర కసరత్తు..
కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్‌ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత ఈ నెల 17 లేదా 18వ తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించగా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలు గెలిచారు.  వీరిలో సీనియర్‌ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు.

ఎర్రబెల్లి దయాకర్‌రావుకు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వెలమలు బలంగా ఉండడం.. ఈ ఎన్నికల్లో వారందరూ గంపగుత్తగా టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేసిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి  ప్రాతినిధ్యం కల్పించేందుకు కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వంలో కేటీఆర్, హరీష్‌రావు కాకుండా అదే సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు మంత్రులుగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు ఇద్దరు కూడా ఓడిపోయారు.

ఈ సామాజిక వర్గం నుంచి స్పష్టమైన ఖాళీలు ఉండడంతో ఆ స్థానంలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం కల్పించేందుకు కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు మొదటి నుంచి త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి భక్తుడు. ఆయన మీద విపరీతమైన గురి. అదే సమయంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా చినజీయర్‌ స్వామి భక్తుడే. ఈ నేపథ్యంలో దయాకర్‌రావును బాగా చూసుకొమ్మని కేసీఆర్‌కు చినజీయర్‌ స్వామి  చెప్పినట్లు  అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. 

ఎంపీ నియోజకవర్గ రిపేర్‌ కోసం..
ఎస్టీ రిజర్వ్‌ విభాగం నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా గుర్తింపు ఉండడంతో పాటు కేసీఆర్‌ తరానికి చెందిన నేతగా ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇది కాకుండా మహబూబాబాద్‌ ఎంపీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలహీనంగా ఉంది. ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డోర్నకల్, మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే గెలిచారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల నాటికి మహబూబాబాద్‌ను  పార్టీ పరంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని.. అదీ రెడ్యానాయక్‌కు ఇవ్వడం మంచిదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరో ఇద్దరికి గౌరవప్రద పోస్టులు
జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య పై   వరుసగా రెండు సార్లు గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్‌ పశ్చిమ నుంచి  నాలుగు సార్లు గెలిచిన దాస్యం వినయ్‌ భాస్కర్‌కు మంత్రి వర్గంలో స్థానం కాకుండా గౌరవ ప్రదమైన పోస్టులు ఇవ్వాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement